Liquor prices to increase in Telangana: ఎర్రటి ఎండలో ఓ చల్లని బీర్ వేసుకుందాని చూస్తున్నారా?.. అయితే, మీకో బ్యాడ్‌న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే మద్యం, బీర్ల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం మద్యం ధరల పెంపునకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు ముగిసిపోవడంతో, ధరల పెంపునకు ముహుర్తం కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ తర్వాత ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాగా, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగాయి. దీనివల్ల లిక్కర్ సీసాల తయారీకి అత్యంత అవసరమైన ఎల్పీజీ సహజ వాయువు కొరత ఏర్పడింది. గ్లాస్ బాటిళ్లు, రవాణా ఖర్చులు, ప్యాకింగ్ మెటీరియల్స్ ధరలు సైతం భారీగా పెరగడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ధరలను సవరించాలని డిస్టిలరీలు, బ్రేవరీస్ కంపెనీలు గతేడాది కాలంగా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాల వ్యయం రోజురోజుకూ పెరుగుతుండటంతో, ఆదాయ వనరులను పెంచుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Jagityal: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
10% నుండి 30% వరకు పెరిగే ఛాన్స్..!
కాగా, మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది. ఏ బ్రాండ్ మద్యం ధరను ఎంతమేర పెంచాలని కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రాకుండా, అలాగని కంపెనీలకు నష్టం వాటిల్లకుండా శ్లాబ్ సిస్టమ్ ద్వారా ధరలను 10% నుండి 30% వరకు పెంచాలని త్రిసభ్య కమిషన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సాధారణ బ్రాండ్లు ఫుల్ బాటిల్‌పై రూ. 60 వరకు, ప్రీమియం బ్రాండ్లు రూ. 100 వరకు, హై-ఎండ్ బ్రాండ్లు రూ. 120 వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే ఎండల తీవ్రత, ఐపీఎల్ సీజన్ వల్ల రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న బీర్ల ధరలు కూడా 12% నుండి 15% వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ధరల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు నెలకు కనీసంగా రూ. 150 కోట్ల నుండి రూ. 250 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరవచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే, మద్యం ధరల పెంపుతో ఎక్సైజ్ శాఖకు ఏడాదికి దాదాపు రూ. 3 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరానుంది.

