Lookout Notices Bandi Bhagirath: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పరారీలో ఉన్న భగీరథ్‌పై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిందితుడు దేశం దాటి విదేశాలకు పారిపోకుండా నిరోధించేందుకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను అలర్ట్ చేస్తూ పోలీసులు లుకౌట్ నోటీసులు పంపారు. ఏ ఎయిర్‌పోర్టులో కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా, భగీరథ్ ఆచూకీ కోసం సైబరాబాద్ పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీలలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బంజారాహిల్స్‌లోని బండి సంజయ్ నివాసంతో పాటు, భగీరథ్ స్నేహితులు, బంధువుల ఇళ్లలో పోలీస్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి.
అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ లేదా అరెస్ట్ నుంచి ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ భగీరథ్ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కానీ కోర్టు అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణలు సాగుతుండగానే, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలను మరింత ఉద్ధృతం చేశారు.

