HomeతెలంగాణLPG ALERT: గ్యాస్ సబ్సిడీకి 'కేవైసీ' కళ్లెం.. గడువు సమీపిస్తోంది, చేయకపోతే సిలిండర్ బంద్!

LPG ALERT: గ్యాస్ సబ్సిడీకి ‘కేవైసీ’ కళ్లెం.. గడువు సమీపిస్తోంది, చేయకపోతే సిలిండర్ బంద్!

Mandatory e-KYC for LPG subsidy : ప్రతి ఇంటి వంటగదిలో నిత్యావసరంగా మారిన గ్యాస్ సిలిండర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిబంధనను తెరపైకి తెచ్చింది. ఇకపై సబ్సిడీ కొనసాగాలంటే, ప్రతి వినియోగదారుడూ తప్పనిసరిగా ‘ఈ-కేవైసీ’ పూర్తి చేసుకోవాల్సిందే. ఈ ప్రక్రియకు మార్చి 31ని తుది గడువుగా నిర్ణయించారు. ఒకవేళ గడువులోగా పూర్తిచేయకపోతే, మీ సబ్సిడీ ఆగిపోవడమే కాదు, తర్వాతి సిలిండర్ బుకింగ్‌కే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. 

- Advertisement -

ఎందుకీ ఈ-కేవైసీ? : గ్యాస్ సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, నకిలీ, డూప్లికేట్ కనెక్షన్లను ఏరివేసేందుకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. దీని ముఖ్య ఉద్దేశం, అర్హులైన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ఫలాలు అందేలా చూడటం. సాధారణ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు, సబ్సిడీ పొందుతున్న ప్రతీ ఒక్కరూ ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలి.

గడువు మార్చి 31.. లేదంటే శాశ్వతంగా రద్దు :  ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించిన ఈ-కేవైసీ ప్రక్రియను మార్చి 31వ తేదీలోపు పూర్తిచేయాలని చమురు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. గడువులోగా ఈ-కేవైసీ చేయించకపోతే, ఆ ఆర్థిక సంవత్సరానికి మీకు రావాల్సిన సబ్సిడీ శాశ్వతంగా రద్దవుతుంది. ఏడాదికి 9 సిలిండర్లకు సబ్సిడీ ఇస్తుండగా, 8వ, 9వ సిలిండర్లకు సబ్సిడీ విడుదల చేసే ముందు ఈ-కేవైసీ ధ్రువీకరణను తనిఖీ చేస్తున్నారు. ధ్రువీకరణ పూర్తి కాకపోతే, సబ్సిడీని తాత్కాలికంగా నిలిపివేస్తారు.

ఎలా చేసుకోవాలి? మూడు సులభ మార్గాలు : ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి వినియోగదారులకు మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీ ఆధార్ కార్డు తీసుకుని, సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి, బయోమెట్రిక్ (వేలిముద్ర) ద్వారా పూర్తి చేయవచ్చు. సిలిండర్ డెలివరీకి వచ్చినప్పుడు, డెలివరీ బాయ్ వద్ద ఉన్న యాప్ ద్వారా కూడా బయోమెట్రిక్ వేసి ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు. మీ గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయి, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

కావాల్సినవి: ఆధార్ కార్డు (మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి), గ్యాస్ కస్టమర్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. తెలంగాణలో సుమారు 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వీరిలో 39.57 లక్షల మంది సబ్సిడీకి అర్హులు. కాబట్టి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే మీ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకుని, మీ సబ్సిడీకి, సిలిండర్‌కు ఢోకా లేకుండా చూసుకోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News