LRS deadline extended: అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS) ప్రక్రియకు సంబంధించి రేవంత్ సర్కార్ మరోసారి గడువును పొడిగించింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులకు నవంబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న 25 శాతం రాయితీని సైతం యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది.
ఆశించిన స్థాయిలో లేని స్పందన: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇప్పటికే గడువును పలుమార్లు పొడిగించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ఇప్పటికే దాఖలైన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పూర్తిస్థాయిలో వేగవంతం కాకపోవడంతో ప్రజల నుంచి కొంత ఆసక్తి తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం గడువును పొడిగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Also read-Nara Lokesh: ఎర్రబస్సు కూడా రాదన్నారు..ఎయిర్‌పోర్టు వచ్చింది
కాంగ్రెస్ ప్రభుత్వం కీలక సవరణలు: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలపై కీలక సవరణలు చేసింది. గత ఏడాది మార్చిలో క్రమబద్ధీకరణ ఫీజుపై తొలుత 50 శాతం, ఆ తర్వాత 25 శాతం రాయితీని ప్రకటించింది. ఈ రాయితీ నిబంధన ప్రకారం.. దరఖాస్తుదారులు తాము చెల్లించాల్సిన ఫీజు మొత్తంలో 25 శాతం మినహాయింపును పొందుతూ.. మిగిలిన బకాయిలను చెల్లించడం ద్వారా తమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు ఉంది.

