Minister Uttam Kumar Reddy: ఎంత ఖర్చయినా సరే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ కోసం జూన్ 2లోపు నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల పురోగతిపై ఆదివారం జలసౌధలో అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్షించారు.
‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు రూ. 5వేల కోట్లు ఖర్చు చేస్తాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పదేళ్లపాటు పట్టించుకోలేదు. 2014 జూన్ 2న ఎలా ఉన్నాయో.. 2024 జూన్ 2న కూడా అలాగే ఉన్నాయి. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి సోర్సును మార్చివేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. కాళేశ్వరంలో చేసిన పొరపాటే.. ఈ ప్రాజెక్టులోనూ చేశారు. ఎంత ఖర్చయినా సరే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేసి తీరతాం.’ అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

