వనపర్తి, (తెలుగు ప్రభ): పదవిలో ఉన్నా హంగూ ఆర్భాటాలకు దూరంగా ప్రజల్లో కలిసిమెలిసి తిరుగుతూ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆకట్టుకున్నారు. పట్టణంలోని 27వ వార్డులో బొట్టు రాజేష్ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కాలనీలో కాలినడకన తిరుగుతూ స్థానికులను పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రామాలయం ఆర్చ్ సమీపంలోని సాధారణ టీ దుకాణంలో స్థానికులతో కలిసి టీ తాగుతూ ముచ్చటించారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని హెయిర్ కటింగ్ షాపులో సాధారణంగా కటింగ్ చేయించుకున్నారు.

ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ ఎలాంటి హంగూ ఆర్భాటాలకు తావివ్వకుండా సామాన్యుడిలా ప్రజలతో కలిసిమెలిసి వ్యవహరించిన మేఘారెడ్డి తీరు స్థానికులను ఆకట్టుకుంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు, కష్టసుఖాలను తెలుసుకోవడం ద్వారా ప్రజాప్రతినిధులు మరింత చేరువ కావచ్చని పలువురు పేర్కొన్నారు.

