వనపర్తి డిపోలో 99.74 శాతం పోలింగ్
389 మందికి 388 మంది ఓటింగ్
17న ఫలితాల వెల్లడి
వనపర్తి: (తెలుగు ప్రభ):ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో వనపర్తి డిపో కార్మికులు ఓటు హక్కు వినియోగంలో ఉత్సాహం చూపారు. శుక్రవారం ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొత్తం 389 మంది కార్మికులకు గాను 388 మంది ఓటేయడంతో 99.74 శాతం పోలింగ్ నమోదైంది. ఒక్క ఓటు మాత్రమే పోలవకపోవడం కార్మికుల్లో ఎన్నికల పట్ల ఉన్న ఆసక్తిని చాటుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్మిక సంఘాలు బరిలో నిలవడంతో గుర్తింపు సంఘం పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో టీఎంయూ, టీజేఎంయూ, టీపీఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ సహా 12 కార్మిక సంఘాలు పోటీపడుతున్నాయి. సుమారు 36 వేల మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 115 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.వనపర్తి డిపోలో పోలింగ్ ముగియడంతో కార్మిక సంఘాలు ఫలితాలపై ఆశలు పెట్టుకున్నాయి. ఈ నెల 17న రాష్ట్రస్థాయిలో ఓట్ల లెక్కింపు జరగనుంది. చివరిసారిగా 2016లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగ్గా, దాదాపు పదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు ఆర్టీసీ కార్మిక సంఘాలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

