నాగర్ కర్నూల్ (తెలుగు ప్రభ): జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని, సంక్షేమ పథకాల అమలుతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నియోజకవర్గంలోని రహదారుల విస్తరణ, మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ఏదుల మండల పరిధిలోని లబ్ధిదారులకు మంగళవారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి జూపల్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 36 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా రహదారుల విస్తరణ, మరమ్మతుల పనులకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. గతంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిపై ఎలాంటి దృష్టి సారించలేదని, నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. పిల్లలకు విద్యతోపాటు విలువలు, సంస్కారం నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. పిల్లల స్నేహాలు, వారి నడవడికపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. కుటుంబంలో మంచి వాతావరణం కల్పించడం ద్వారా పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దగలమని అన్నారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
Jupally Krishna Rao: అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తున్నాం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

