సిద్దిపేట (తెలుగుప్రభ): ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో నిరవధిక సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులను చాయ్ తాగినంత సమయంలోనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు.
మూడేళ్లవుతున్నా హామీలేవీ?
ఎన్నికల సమయంలో ఎన్హెచ్ఎం, ఆయుష్, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఆ హామీల అమలులో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాయ్ తాగినంత సమయంలోనే ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి.. ఇప్పుడు ఆ హామీ గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. మాటలు చెప్పడం కాదని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు.
నెల మొదట్లో జీతాలేవి?
ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందకపోవడం దురదృష్టకరమని హరీశ్‌రావు అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందాల్సిన ఉద్యోగులు 15వ తేదీ వచ్చినా వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఒక్కోసారి రెండు, మూడు నెలలపాటు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. అదే వ్యవస్థలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం, ఆయుష్ ఉద్యోగులకు ఎందుకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించామని ఆయన పేర్కొన్నారు.
కరోనా సమయంలోనూ విశేష సేవలు
ఎన్హెచ్ఎం ఉద్యోగులు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారని, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించారని హరీశ్‌రావు అన్నారు. ఆయుష్ ఉద్యోగులు సైతం పల్లె దవాఖానాల్లో ప్రజలకు సేవలందిస్తూ ప్రభుత్వ వైద్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇన్నేళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమన్నారు.
రెగ్యులరైజేషన్.. సమాన పనికి సమాన వేతనం
ఎన్హెచ్ఎం, ఆయుష్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు సమాన పనికి సమాన వేతనం అందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అర్హత, వర్తించే నిబంధనల ప్రకారం జీపీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలన్నారు. విధి నిర్వహణలో ఉద్యోగికి ప్రమాదం జరిగినా, మరణించినా వారి కుటుంబాలకు బీమా భరోసా కల్పించాలని కోరారు. ఉద్యోగులు అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య చికిత్సకు తగిన సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు.
సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సేవలను సైతం ప్రభుత్వం గుర్తించి, వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం, ఆయుష్, ఈజీఎస్, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
ఎన్హెచ్ఎం, ఆయుష్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ వేతనాలు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, రానున్న రోజుల్లోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

