యువత సోషల్ మీడియా ట్రాప్‌లో పడొద్దు.. చదువు, ఉద్యోగం, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి
సద్దుల బతుకమ్మ నాడు కోమటి చెరువు కట్టపైనే ఉంటా.. మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, (తెలుగుప్రభ):రీల్స్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా మోజులో పడి యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల పట్ల ఆకర్షితులై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ముందుగా చదువుపై దృష్టి సారించి ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరపడిన తర్వాతే జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. నిజజీవితానికి, రీల్స్‌కు ఎంతో తేడా ఉంటుందని, రీల్స్ చూసి వాటినే వాస్తవాలుగా భావించవద్దని యువతకు పిలుపునిచ్చారు.
సిద్దిపేట పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ప్రతిభ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. యువత సోషల్ మీడియాకు బానిసలు కాకుండా కరెంట్ అఫైర్స్, దేశంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాగా చదివి ఉన్నత విద్యను అభ్యసించాలని, ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగంలో ఉద్యోగం సంపాదించి తమ కాళ్లపై తాము నిలబడాలని ఆకాంక్షించారు.
కోమటి చెరువు కట్టపైనే నా బతుకమ్మ
సద్దుల బతుకమ్మ వేడుకలను సిద్దిపేట ప్రజల మధ్యే, కోమటి చెరువు కట్టపైనే జరుపుకుంటానని హరీశ్‌రావు స్పష్టం చేశారు. దుబాయ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, అమెరికా, లండన్ తదితర ప్రాంతాల్లో నిర్వహించే బతుకమ్మ సంబరాలకు తెలంగాణ సంఘాల నుంచి ఆహ్వానాలు వచ్చినప్పటికీ, సద్దుల బతుకమ్మ రోజు మాత్రం సిద్దిపేటను విడిచిపెట్టనని పేర్కొన్నారు. తన అక్కాచెల్లెళ్లు, పిల్లలు బతుకమ్మ ఆడే కోమటి చెరువు కట్టపైనే ఉంటానని తెలిపారు.
బతుకమ్మ తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన పండుగని, రాష్ట్ర ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. తరాలు మారుతున్నా, జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తున్నా బతుకమ్మ పండుగకు ఆదరణ పెరుగుతూనే ఉందని చెప్పారు. పెళ్లయిన ఆడపడుచులు పుట్టింటికి చేరి తల్లిని కలుసుకోవడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం ఈ పండుగలోని ప్రత్యేకతగా అభివర్ణించారు.
బతుకమ్మ వెనుక శాస్త్రీయ కోణం
బతుకమ్మను గునుగు, తంగేడు పూలతో పేర్చడం వెనుక పూర్వీకుల ఆలోచన, ప్రకృతితో ముడిపడిన సంప్రదాయం ఉన్నాయని హరీశ్‌రావు వివరించారు. వర్షాకాలం ముగిసే సమయంలో చెరువుల్లోకి మట్టి, మలినాలు, ఇతర పదార్థాలు చేరుతాయని, అలాంటి సమయంలో బతుకమ్మ పూలను చెరువుల్లో నిమజ్జనం చేసే ఆచారం కొనసాగుతోందని చెప్పారు. ఈ పూలకు నీటిని శుభ్రపరిచే గుణాలు ఉన్నాయనే నమ్మకం సంప్రదాయం వెనుక ఉందని పేర్కొన్నారు.
ఒకప్పుడు చెరువులే గ్రామాలకు తాగునీరు, వ్యవసాయం, పశువుల అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉండేవని గుర్తుచేశారు. మన పూర్వీకులు సంస్కృతితో పాటు ప్రకృతిని కూడా దృష్టిలో పెట్టుకొని సంప్రదాయాలను రూపొందించారని వివరించారు.
సిద్దిపేటకు యూనివర్సిటీ తీసుకొస్తాం
సిద్దిపేటను విద్యాలయాల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశామని హరీశ్‌రావు అన్నారు. వివిధ కోర్సులతోపాటు ప్రైవేటు మెడికల్ కళాశాల, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ వంటి విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గేలా అన్ని రకాల విద్యాసదుపాయాలను సిద్దిపేటలోనే అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమన్నారు. సిద్దిపేటకు ఒక యూనివర్సిటీ తీసుకురావడం తన కోరికగా పేర్కొంటూ, తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ఆ దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కరెంట్ అఫైర్స్‌పై అవగాహన పెంచుకోండి
విద్యార్థులు గంటల తరబడి మొబైల్ ఫోన్లలో రీల్స్ చూస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దని హరీశ్‌రావు సూచించారు. రీల్స్ ఆకర్షణీయంగా రూపొందిస్తారని, వాటిలో చూపించేవన్నీ నిజజీవితంలో సాధ్యమయ్యేవి కావని అన్నారు. ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా పరిచయాల ఆధారంగా వ్యక్తుల నేపథ్యం తెలుసుకోకుండా ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్లడం వల్ల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తల్లిదండ్రులను మించిన శ్రేయోభిలాషులు ఎవరూ ఉండరని, వారి మాటలకు విలువనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలిక ఆవేశం, భావోద్వేగాలకు లోనై తీసుకునే నిర్ణయాలు జీవితాంతం బాధకు కారణమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజాప్రతినిధిగా తన వద్దకు వ్యక్తిగత సమస్యలతో వచ్చే యువతీ యువకుల బాధలను చూస్తున్నానని, అందుకే యువతకు ఈ సూచనలు చేస్తున్నానని చెప్పారు.
డిగ్రీతో చదువును ఆపకుండా పీజీ వంటి ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉద్యోగం చిన్నదా పెద్దదా అని చూడకుండా ముందుగా ఉపాధి సాధించాలని, ఆ తర్వాత మరింత మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించాలని హితవు పలికారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మంచి చెడులను విశ్లేషించే అలవాటు పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

