సంగారెడ్డి(తెలుగుప్రభ): సంగారెడ్డి పట్టణ శివారులోని ఇర్ఫాని దర్గా 24వ ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉర్సు ముగింపు సందర్భంగా దర్గాలో ప్రత్యేక దీపారాధన, ప్రార్థనా కార్యక్రమాలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వహించిన ఖవ్వాలి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఉర్సు ముగింపు కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్గాలకు కులమతాలకు అతీతంగా ప్రజలు తరలివస్తారని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య సోదరభావం, ఐక్యతను మరింత పెంపొందిస్తాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఉర్సు వేడుకల్లో సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ అహ్మద్, కాంగ్రెస్ నాయకుడు కూన సంతోష్ కుమార్, దర్గా నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


