Congress Ministers Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ సన్మాన సభలో మంత్రుల మధ్య సమన్వయం కరువైంది. ముందుగా ఒంటి గంట సమయంలో మంత్రి దామోదర వేదిక పైకి వచ్చి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పటాన్ చెరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సన్మాన సభ కార్యక్రమాన్ని ముహూర్తం ఫిక్స్ చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మార్కెట్ యార్డ్ వరకు నాయకులు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. మంత్రి రాక ఆలస్యం కావడంతో ఈ ర్యాలీ వేదిక వద్దకు చేరే సరికి మధ్యాహ్నం దాటింది. తీవ్ర ఎండతో కార్యకర్తలు సభావేదిక వద్ద ఇబ్బందులు పడ్డారు. ముందుగా మంత్రి దామోదర రాజనర్సింహ నూతన మార్కెట్ కమిటీ ఛైర్మన్‌తో పాటు నూతన పాలకవర్గానికి సన్మానం చేసి ప్రసంగించి వెళ్లిపోయారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/veteran-singer-asha-bhosle-passes-away/

దామోదర అవుట్.. వివేక్ ఇన్..
వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర ప్రసంగించి వెళ్ళిపోయాక ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ నీలం మధుతో కలిసి కార్యక్రమం వద్దకు వచ్చారు. ఈ వ్యవహారంలో మంత్రుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. వివేక్ వెంకటస్వామి సభా ప్రాంగణంలోకి వచ్చేటప్పటికి దామోదర వెళ్లిపోవడంతో కార్యక్రమానికి హాజరైన శ్రేణులు, ప్రజలు వెళ్లిపోవడంతో సభ ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.

ఖాళీ కుర్చీల మధ్యనే వివేక్ వెంకట స్వామి ప్రసంగాన్ని చప్పగా కొనసాగించారు. చాలా రోజుల తర్వాత జిల్లా మంత్రి దామోదరతో పాటు వివేక్ వెంకట స్వామి ఇరువురు కలిసి కార్యక్రమానికి హాజరు కావడంతో కార్యకర్తలు తమకు మంత్రుల నుంచి మద్దతు లభిస్తుందని ఆశించినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రసంగాలు లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకుల కంటే తమ పరిస్థితి హీనంగా ఉందని కార్యకర్తలు వాపోయారు. ఇప్పటికైనా మంత్రులు ఇరువురు తమకు అండగా ఉంటామని భరోసా ఇస్తారనుకుంటే సన్మాన సభలో ఫోటోలకు ఫోజులు ఇచ్చి తమ దారిన తాము వెళ్లిపోయారని విమర్శలు వ్యక్తం చేశారు.

Also Read: https://teluguprabha.net/career-news/telangana-inter-supplementary-exams-from-may-13th/
అయితే కార్యక్రమ నిర్వహణ విషయంలోనూ లోపాలు స్పష్టంగా కనిపించాయని చెప్పవచ్చు. కార్యక్రమం తగ్గట్టు ఏర్పాట్లు చేయకపోవడంతో కార్యకర్తలు మంత్రులను సన్మానం చేయడానికి ఎగబడ్డారు. దీంతో స్టేజి పైన ఉన్న నాయకులతో పాటు కింద ఉన్న శ్రేణులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో తూతు మంత్రంగా సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించి మమ అనిపించారు.

