Homeతెలంగాణమెదక్‌Ameenpur: రహదారి కోసం ఐకమత్య పోరాటం.. మంత్రి శ్రీధర్‌బాబు స్పందనతో ఊరట

Ameenpur: రహదారి కోసం ఐకమత్య పోరాటం.. మంత్రి శ్రీధర్‌బాబు స్పందనతో ఊరట

పటాన్ చెరు (తెలుగు ప్రభ): అమీన్‌పూర్ నివాసితుల సుదీర్ఘ నిరీక్షణకు, సమిష్టి పోరాటానికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఏళ్లకు ఏళ్లుగా అరకొర రోడ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు ఒక్కటై గళమెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. అమీన్‌పూర్ ప్రధాన రహదారి నిర్మాణ పనులను వెంటనే పునఃప్రారంభించి, వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

గతంలో నేషనల్ హైవే 65 నుంచి అమీన్‌పూర్ వరకు రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసినప్పటికీ, పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం అమీన్‌పూర్ చెరువు వద్దకు స్థానిక కాలనీవాసులు, ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసన చేపట్టారు. అనంతరం అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ ప్రతినిధులు నేరుగా మంత్రి శ్రీధర్ బాబును కలసి క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

స్పందించిన మంత్రి, తక్షణమే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి నిలిచిపోయిన రోడ్డు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అమీన్‌పూర్‌లో అత్యధిక సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నివసిస్తున్నారని, మౌలిక వసతుల లేమితో వారి రాకపోకలకు ఎలాంటి అవరోధాలు కలగడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పీపుల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకుల తిరుమల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, సెక్రటరీ విష్ణుతో పాటు నాయకులు సంపత్, పృథ్వి, రామచంద్ర, ప్రశాంత్, సంతోష్ రెడ్డి, రాము, వివిధ కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News