సిద్దిపేట (తెలుగుప్రభ): ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి ఓ వ్యక్తిని రూ.16.32 లక్షలకు మోసం చేసిన సైబర్ నేరగాళ్ల వ్యవహారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది. ఈ కేసులో కీలక నిందితుడిని సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
వాట్సాప్ గ్రూపుతో వల.. నకిలీ లాభాలతో మాయ
పోలీసుల వివరాల ప్రకారం.. బాధితుడిని గుర్తుతెలియని వ్యక్తులు “Z4 Invesco High-Profit Stock Study Group” అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ప్రముఖ పెట్టుబడి సంస్థ ప్రతినిధులమంటూ పరిచయం చేసుకున్న నిందితులు, తమ గ్రూపు సెబీ, ఆర్బీఐ, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తోందని నమ్మించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించారు.
నకిలీ వెబ్‌సైట్లలో రిజిస్ట్రేషన్ చేయించి తొలుత చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించారు. అనంతరం వెబ్‌సైట్లలో భారీ లాభాలు వచ్చినట్లు నకిలీ వివరాలు చూపించి బాధితుడిని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు ఏడు విడతల్లో తన బ్యాంకు ఖాతాల నుంచి రూ.16,32,000 బదిలీ చేశాడు.
మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని నిందితులు ఒత్తిడి చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించాడు. వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు.
చెన్నైకి చెందిన నిందితుడి అరెస్ట్
కేసు దర్యాప్తులో భాగంగా బాధితుడి డబ్బులు బదిలీ చేసేందుకు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ క్రమంలో చెన్నైలోని పట్టాభిరామ్, భారతియార్ నగర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ (28), ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
నిందితుడిని నవంబర్ 3న అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించినట్లు సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఈ మోసంలో నిందితుల మధ్య ఉన్న సంబంధాలు, బ్యాంకు లావాదేవీలు, నగదు బదిలీ మార్గాలపై (మనీ ట్రయిల్) దర్యాప్తు కొనసాగుతోంది.
నిందితుడి అరెస్ట్‌పై సీపీ అభినందనలు
కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్న సిద్దిపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ పి. రాజు, అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే అధిక లాభాల పెట్టుబడి ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంస్థలు, బ్రోకర్లు సెబీ వద్ద నమోదై ఉన్నాయో లేదో అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని, గుర్తుతెలియని వెబ్‌సైట్లు, లింకులు, ఏపీకే ఫైళ్ల ద్వారా పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరించారు.
బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఇతరులకు వెల్లడించకూడదని, వ్యక్తిగత లేదా గుర్తుతెలియని బ్యాంకు ఖాతాలకు పెట్టుబడి పేరుతో నగదు బదిలీ చేయవద్దని స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడంతో పాటు www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని, సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించి లావాదేవీలను నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
మీ ఖాతా.. మీ బాధ్యత
తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వడం, ఇతరుల కోసం ఖాతాలు తెరవడం, ఏటీఎం కార్డులు లేదా సిమ్ కార్డులు అప్పగించడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి చర్యలతో సైబర్ నేరాల్లో భాగస్వాములయ్యే ప్రమాదం ఉందని, కఠిన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
గుర్తుంచుకోండి.. అధిక లాభాల ఆశే సైబర్ మోసానికి మార్గం!
ఆగండి.. ఆలోచించండి.. ధ్రువీకరించండి!
సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్: 1930

