Road Accident Three Died: బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తూ తీరని లోకాలకు చేరిన దుర్ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. అతివేగమే వారి పాలిట మృత్యుపాశంగా మారింది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు తండ్రీకొడుకులు కావడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read: https://teluguprabha.net/cinema-news/again-anushka-shetty-marriage-rumors-back-in-spotlight/
మెదక్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన బైకు ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. కొల్చారం మండలం రాంపూర్ శివారులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన అమృత్ గౌడ్(50), అతని కుమారుడు రిషి వర్దన్ గౌడ్(12), అల్లుడు సాయ గౌడ్(35) కలిసి రంగంపేట గ్రామంలో బంధువుల ఇంట్లో తొట్టెల కార్యక్రమానికి హాజరయ్యారు. శుభకార్యం అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా రాంపూర్ శివారులో మెదక్ వైపు నుంచి నర్సాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురూ అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

