Monday, February 16, 2026
HomeతెలంగాణPublic Outcry: : మేడారంలో అంబులెన్స్‌ల మాయాజాలం..సైరన్‌ మోతతో వీఐపీ ట్రిప్పులు!

Public Outcry: : మేడారంలో అంబులెన్స్‌ల మాయాజాలం..సైరన్‌ మోతతో వీఐపీ ట్రిప్పులు!

Medaram Jatara Ambulance Misuse :  ఆపదలో ఆదుకోవాల్సిన వాహనం.. ఇప్పుడు అక్రమాలకు అడ్డాగా మారింది. సైరన్ మోగితే ప్రాణం పోతున్నదేమో అని ట్రాఫిక్‌లో జనం పక్కకు తప్పుకుంటారు. కానీ ఆ వాహనంలో ఉన్నది రోగులు కాదు.. దర్జాగా జాతర చూసేందుకు వెళ్తున్న ‘వీఐపీ’ భక్తులు! అవును, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో పవిత్రమైన వైద్య వృత్తికి మచ్చ తెచ్చే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ‘ఎసెన్షియల్ సప్లై  పేరిట పాసులు తగిలించుకుని, అంబులెన్స్‌లను అద్దె కార్లలా తిప్పుతున్న ములుగు డీఎంహెచ్‌వో (DMHO) కార్యాలయ సిబ్బంది నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

- Advertisement -

ఎమర్జెన్సీ బోర్డు.. లోపల జల్సా రైడు : మేడారం జాతర రద్దీని ఆసరాగా చేసుకుని వైద్య శాఖలోని కొందరు సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారు. సామాన్య భక్తులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడుతుంటే, అంబులెన్స్‌ల దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతోంది.

ట్యాక్సీలుగా అంబులెన్స్‌లు: ములుగు నుండి మేడారం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా ఉంటాయి. దీన్ని అవకాశంగా మలుచుకున్న సిబ్బంది, అంబులెన్స్‌లను రవాణా వాహనాలుగా మార్చేశారు.  వాహనంపై ‘ఎమర్జెన్సీ సర్వీస్’ లేదా ‘ఎసెన్షియల్ సప్లైస్’ అనే బోర్డులు/స్టిక్కర్లు అంటిస్తున్నారు. పోలీసులు ఆపకుండా ఉండేందుకు సైరన్లు వేసుకుంటూ రొద చేస్తున్నారు.

బంధుప్రీతి.. దర్జాగా మహాద్వారం ఎంట్రీ : ఈ అక్రమ రవాణా వెనుక పెద్ద తతంగమే నడుస్తోంది. ఇందులో ప్రయాణిస్తున్నది ఆపదలో ఉన్న రోగులు కాదు. వైద్య శాఖలో పనిచేస్తున్న డాక్టర్ల కుటుంబ సభ్యులు, వారి బంధువులు, స్నేహితులను ములుగు నుంచి ఎక్కించుకుని నేరుగా మేడారం జాతరలోని మహాద్వారం (ప్రధాన ప్రవేశ ద్వారం) వరకు చేరవేస్తున్నారు. సాధారణ వాహనాలను కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేస్తుండగా, ఈ అంబులెన్స్‌లు మాత్రం అత్యవసర సేవ అనే నెపంతో గద్దెల సమీపం వరకు వెళ్తున్నాయి. ఇది సామాన్య భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది.

ములుగు డీఎంహెచ్‌వో ఆఫీస్ కేంద్రంగా : ఈ అక్రమ దందాకు సూత్రధారులు ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ డీజిల్, ప్రభుత్వ వాహనం.. కానీ ఆదాయం లేదా ప్రయోజనం మాత్రం వ్యక్తులకు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఒక్కో అంబులెన్స్ రోజుకు పలు ట్రిప్పులు తిరుగుతూ కేవలం బంధువులను చేరవేయడానికే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాతరలో వైద్య సేవలు అందించాల్సిన వాహనాలు ఇలా సొంత పనులకు తిరుగుతుంటే, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. అత్యవసర సమయంలో నిజమైన రోగికి అంబులెన్స్ దొరక్కపోతే బాధ్యత ఎవరిది..?

చర్యలు శూన్యం : ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వ్యవస్థే ఇలా నిబంధనలు తుంగలో తొక్కితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా అంబులెన్స్‌ల కదలికలపై నిఘా ఉంచాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News