Medigadda L and T Office burnt to ashes: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజి వద్ద ఉన్న ఎల్‌అండ్‌టీ సంస్థ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ ప్రమాద తీవ్రతకు కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్‌తో పాటు బ్యారేజీ నిర్మాణానికి, డిజైన్లకు సంబంధించిన అనేక కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన కొన్ని పిల్లర్లు కుంగిపోయిన ఉదంతంపై ఇప్పటికే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్), విజిలెన్స్ విభాగాలు, న్యాయ కమిషన్ విచారణలు జరుపుతున్న తరుణంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Also Read: KTR election sketch: డిసెంబర్‌లోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. సిద్ధమవ్వాలని కేడర్‌కి కేటీఆర్ పిలుపు..!
పిల్లర్ల పునరుద్ధరణ, స్థిరత్వంపై నిపుణుల కమిటీ..
ముఖ్యంగా, మేడిగడ్డ బ్యారేజీపై కుంగిపోయిన పిల్లర్ల పునరుద్ధరణ, వాటి స్థిరత్వంపై నిపుణుల కమిటీలు క్షేత్రస్థాయిలో కీలకమైన పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ఈ ఘటన జరగడం గమనార్హం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే కార్యాలయం అధిక భాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదంతంపై స్థానిక పోలీసులు నిశితంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇది కేవలం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదమా? లేదా బ్యారేజీ విచారణకు సంబంధించిన కీలక ఆధారాలను, రికార్డులను ధ్వంసం చేసేందుకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రా? అనే కోణంలో భద్రతా బలగాలు, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి లోతుగా విచారణ జరుపుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు బహిర్గతం కానున్నాయి.

