Nursing Officers: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొత్తగా ఎంపికైన 1,919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న నర్సింగ్ ఆఫీసర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో మంగళవారం ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. త్వరలో ANM పోస్టులకు సంబంధించిన నియామక పత్రాలను అందజేస్తామని మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు.
Also Read: https://teluguprabha.net/telangana/bandi-sanjay-sensational-comments-2/
రాష్ట్రంలో నర్సింగ్ వృత్తిని బలోపేతం చేసేందుకు, శిక్షణను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి దామోదర ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య శాఖలో ఇప్పటివరకు సుమారు 9,572 పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. మరో 7,562 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. త్వరలో 2 వేల మంది ఏఎన్‌ఎంలకు నియామక పత్రాలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. కోర్టు కేసుల వల్ల ఏఎన్‌ఎంల నియామకాలు నిలిచిపోయాయని మంత్రి వెల్లడించారు.

Also Read: https://teluguprabha.net/telangana/government-issues-orders-to-bring-t-sat/
కొత్త ఉస్మానియా ఆస్పత్రి 2027 వరకు అందుబాటులోకి వస్తుందని మంత్రి దామోదర చెప్పారు. ఇప్పటివరకూ 16 నూతన నర్సింగ్ కాలేజీలను ప్రారంభించామని.. రాష్ట్రంలో మొత్తం లక్షా 85 వేల మంది నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారని పేర్కొన్నారు. త్వరలో టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని మంత్రి వివరించారు. కాగా, కొత్తగా నియమితులైన వారు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు అందించనున్నారు.

