Minister Jupally: రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే కనీస నైతిక అర్హత బీఆర్ఎస్‌కు లేదని మంత్రి జూపల్లి అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. జూరాలలో ఉన్న నీటితో ఆ ప్రాంతంలోని పూర్తి ఆయకట్టుకు నీరందించడం అసాధ్యమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మోసపోయిన పాలమూరు: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిందని మంత్రి జూపల్లి మండిపడ్డారు. కేవలం 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టును మాత్రమే నిర్మించుకున్నారని విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే సుమారు రూ. 80 వేల కోట్ల నిధులు అవసరమని అన్నారు. కానీ గత ప్రభుత్వం కేవలం రూ. 19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఏకంగా 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని అన్నారు. కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కనీసం కాల్వలు కూడా తవ్వలేదని జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వల నిర్మాణం చేపట్టకుండానే హడావుడిగా ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని ప్రకటించుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
Also Read-Telangana: నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. అర్హతలు ఇవే
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం: కృష్ణా జలాల కేటాయింపుల్లో గత ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని మంత్రి ఆరోపించారు. వాస్తవానికి కృష్ణా జలాల్లో తెలంగాణకు 68.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 31.5 శాతం వాటా దక్కాలని డిమాండ్ చేశారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీల నీటి కేటాయింపులతో సరిపెట్టి ఏపీకి మాత్రం 512 టీఎంసీల నీళ్లు వదిలేసి తీవ్ర ద్రోహం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

