Minister Jupally Meet on tourism sector Development: తెలంగాణను పర్యాటకుల గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. పర్యాటక రంగమంటే కేవలం వినోదం మాత్రమే కాదని.. దేశ, రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే అద్భుత శక్తిగా పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నితం)లో ‘డెస్టినేషన్ తెలంగాణ – రోడ్ అహెడ్’ పేరిట నిర్వహించిన ప్రత్యేక సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.
పర్యాటక రంగం అభివృద్దికి సంస్థలు ముందుకు రావాలి..
‘‘రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రైవేటు భాగస్వామ్యం అత్యంత కీలకం. పారిశ్రామికవేత్తలు కొత్త ఆవిష్కరణలు, సృజనాత్మక ప్రతిపాదనలతో ప్రభుత్వం వద్దకు రావాలి. అప్పుడే పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుంది. పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. వారికి భూములను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి త్వరలోనే ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ ప్రకటనలు జారీ చేస్తాం. దీని ద్వారా ఎంపికయ్యే సంస్థలకు సంబంధించిన డిజైన్లు, ప్రాజెక్టుల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. పర్యాటక ప్రాంతాల్లో తాగునీరు, టాయిలెట్లు, వసతి గృహాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. పర్యాటక ప్రదేశాల్లో సమస్యలను అధిగమించేందుకు ప్రైవేటు వ్యక్తులు సైతం ముందుకు రావాలని కోరుతున్నాం.’’ అని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు.

