Minister Pognuleti Visits Medaram Jathara: మేడారం సమ్మక్క సారక్క మహా జాతరకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ(గురువారం) సమ్మక్క శ్రీ సారలమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీ ద్వారా పరిశీలించారు. మేడారం పరిసరాలను పచ్చదనంగా సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు. జనవరి 18న సీఎం రేవంత్ మేడారంకు రానున్నారని, ఆయన రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కోరారు. మేడారం జాతర సమీపిస్తున్న దృష్ట్యా అక్కడి పనుల పురోగతిని పర్యవేక్షించారు. మేడారంకు వచ్చిన సందర్బంగా మంత్రి పొంగులేటికి మంత్రులు సీతక్క, అడ్మూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురు మంత్రులు సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులను పరిశీలించి వనదేవతలను దర్శించుకున్నారు.
ఏర్పాట్ల విషయంలో రాజీపడొద్దని ఆదేశాలు..
ఆలయ ప్రాంగణంలోని ల్యాండ్ స్కేపింగ్, ప్రధాన ద్వారం ఫ్లోరింగ్ పనులు క్షుణ్నంగా పరిశీలించారు. కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించే ప్రాంగణ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే, ఆర్టీసీ బస్టాండ్, జంపన్న వాగు, స్తూపం రోడ్లను కూడా క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత మంత్రులు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం, మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని అధికారులను కోరారు. రహదారులపై ఉన్న మట్టి, ఇతర వ్యర్ధాలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. రహదారుల సెంట్రల్ లైటింగ్ డివైడర్ మధ్యలో సుందరీకరణ చెట్లను నాటాలని, అలాగే అవసరం ఉన్న చోట కూలీల సంఖ్య పెంచుకొని పనులు జరిగేలా చూడాలని అధికారులను కోరారు. పనుల విషయంలో రాజీపడొద్దని, అధికారులు, గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. కాగా, ఈ నెల 28వ తేదీన మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది.

