Indiramma Houses: అర్హులైన ప్రతి పేదవాడికి సొంతిల్లు నిర్మించి ఇవ్వడంలో వెనకడుగు వేసేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు. మే నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. శనివారం తిరుమలాయపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజా దర్బార్‌లో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన: పాలేరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 క్లస్టర్లలో ప్రజా దర్బార్ నిర్వహించగా దాదాపు 14,700 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు ఉన్నాయని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
రైతులకు భరోసా: వరి, మొక్కజొన్న పండించే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ధరణి పోర్టల్ రైతులకు శాపంగా మారిందని మంత్రి విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారానికే భూ భారతిని తీసుకువచ్చామని.. సాదాబైనామా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పేదలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

