HomeతెలంగాణLands : తప్పును ఒప్పుకున్నాం.. సరిదిద్దుతున్నాం: 22ఏ భూములపై మంత్రి పొంగులేటి ప్రకటన!

Lands : తప్పును ఒప్పుకున్నాం.. సరిదిద్దుతున్నాం: 22ఏ భూములపై మంత్రి పొంగులేటి ప్రకటన!

హైదరాబాద్‌,(తెలుగుప్రభ): ధరణి, 22ఏ నిషేధిత భూముల విషయంలో జరిగిన పొరపాట్లను అంగీకరించి సరిదిద్దుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 24 గంటల్లోనే మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4.. మొత్తం 34 రిజిస్ట్రేషన్లు పూర్తిచేశామని వెల్లడించారు. ధరణిలో జరిగిన తప్పులకు బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టేందుకు, ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 22ఏ జాబితాలో కావాలనే భూములను చేర్చి, వాటిని తొలగించేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణలపై పొంగులేటి తీవ్రంగా స్పందించారు. విమర్శలు చేయడం సులువేనని, బాధ్యత తీసుకోవడం అంత సులువు కాదని అన్నారు. 22ఏ విషయంలో పొరపాటు జరిగిందని ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించిందని, దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా తీసుకుందని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ధరణి పేరుతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు, జరిగిన తప్పులకు హరీశ్‌రావు ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా? కనీసం క్షమాపణ చెప్పారా? అని ప్రశ్నించారు. పేదల సమస్యలను రాజకీయంగా వాడుకోవడం మానుకోవాలని సూచించారు. పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు.

- Advertisement -


తప్పును అధికారులపై నెట్టేయం : తప్పు జరిగితే అధికారులపై నెట్టి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదని మంత్రి పేర్కొన్నారు. చిత్తశుద్ధితో పొరపాటును అంగీకరించి, దానికి పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. కాళేశ్వరం విషయంలో జరిగిన పరిణామాలకు హరీశ్‌రావు ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా? అని ప్రశ్నించారు. తమకు, హరీశ్‌రావుకు ఉన్న తేడా ఇదేనన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. తనపై ఆరోపణలు చేసేవారు ఆధారాలతో మాట్లాడాలని, ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఫీనిక్స్‌, రాఘవ తదితర సంస్థలతో వ్యాపార రంగంలో లావాదేవీలు జరగడం సహజమని, వాటిని ఆధారంగా చేసుకుని రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను రెండు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఉన్నానని, అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. తన వ్యాపార ప్రస్థానం, నేపథ్యం గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.

ప్రైవేట్‌ భూమి ఒక్క అంగుళం తీసుకోం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేదల హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు. పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా ప్రభుత్వం తీసుకోదని చెప్పారు. 22ఏ నిషేధిత జాబితా వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నిషేధిత భూముల వివరాలను ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సరిదిద్దుతోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో వివిధ జీవోలు, మెమోల ద్వారా క్రమబద్ధీకరించిన ప్రైవేట్‌ భూములు, హైకోర్టు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు పొందిన స్థలాలు సాంకేతిక లోపాల కారణంగా 22ఏ జాబితాలోకి వచ్చాయని వివరించారు. సమస్యను గుర్తించిన వెంటనే బాధితులకు ఇబ్బంది కలగకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించామని చెప్పారు. 22ఏ సమస్యల త్వరిత పరిష్కారం కోసం రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే 15 రోజుల పాటు కమిటీ రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి, నిజమైన ప్రైవేట్‌ ఆస్తులను తక్షణమే క్లియర్‌ చేసేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News