Minister Ponguleti on Indiramma Illu: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. జూన్ చివరి నాటికి మరో లక్ష పూర్తవుతాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 18వేల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. సచివాలయంలో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్‌తో కలిసి పొంగులేటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తొలిదశలో హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి అవసరమైన కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లాం. 13 చోట్ల స్థలాలు పరిశీలించాం. జీహెచ్ఎంసీలో ప్రభుత్వ స్థలాల కొరతతో 18 వేల ఇళ్లే ఇచ్చాం. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం, డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం విలువైన ప్రభుత్వ భూములను కేటాయిస్తున్నాం. జీవనోపాధికి అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో, నివాసయోగ్యమైన ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నాం.
యుద్ద ప్రాతిపదికన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం..
పేదల ఆలోచనలు, సూచనలకు అనుగుణంగానే యుద్ధ ప్రాతిపదికన డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం. ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా మహిళల పేరుమీద రిజిస్ట్రేషన్ చేస్తాం. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 10 ఇళ్లు కూడా నిర్మించలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చాక ఒక్కో నియోజకవర్గానికి 3,500కు పైగా ఇళ్లు నిర్మించి ఇచ్చాం. రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు కేటాయిస్తాం.’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

