HomeతెలంగాణMinister Ponguleti: మూడు దశల్లో సమగ్ర భూసర్వే

Minister Ponguleti: మూడు దశల్లో సమగ్ర భూసర్వే

  • 285 గ్రామాల్లో సర్వే పూర్తి.. అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు
  • వచ్చే నెలాఖరుకు తొలి దశ పూర్తి లక్ష్యం
  • మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారు
  • పాలేరు నియోజకవర్గంలో త్వరలో భూదార్‌ పట్టాల పంపిణీ
  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 17 (తెలుగుప్రభ): రాష్ట్రంలో భూ సమస్యలు, వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వచ్చే నెలాఖరుకు తొలి దశ సర్వేను పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున, నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 285 గ్రామాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది జీవనాధారమని మంత్రి పేర్కొన్నారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్‌ నంబర్‌ కేటాయించి, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. భూ యాజమాన్య హక్కులపై స్పష్టత తీసుకురావడంతో పాటు తరతరాలుగా కొనసాగుతున్న వివాదాలకు పరిష్కారం చూపడంలో రీసర్వే కీలకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 1936 నాటి నిజాం కాలం సర్వే రికార్డులే ప్రధాన ఆధారాలుగా ఉన్నాయని మంత్రి తెలిపారు. కాలక్రమేణా భూముల విభజనలు, సర్వే నంబర్ల ఉపవిభాగాలు పెరగడం, పట్టణీకరణ విస్తరించడం, పరిపాలనా సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల భూముల అసలు హద్దులపై స్పష్టత కొరవడిందన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్ర రీసర్వే చేపడుతున్నట్లు వివరించారు. రీసర్వే పనులను వేగవంతం చేసేందుకు ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశామని, అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని వెల్లడించారు. డీజీపీఎస్‌ ద్వారా సేకరించిన సమాచారాన్ని క్యూజీఐఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూ భారతి పోర్టల్‌లో నమోదు చేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 2.29 కోట్లకు పెరిగిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని సర్వే నంబర్లకు దశలవారీగా భూదార్‌ నంబర్లు కేటాయించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూకమతానికి కచ్చితమైన సరిహద్దులు, ప్రత్యేక సర్వే పటాలు సిద్ధం చేస్తామని తెలిపారు.

పాలేరులో త్వరలో భూదార్‌ పట్టాలు
తన సొంత నియోజకవర్గమైన పాలేరులోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పరిధిలో మొత్తం 665 ఎకరాల్లో వందశాతం రీసర్వే విజయవంతంగా పూర్తయిందని పొంగులేటి తెలిపారు. త్వరలో అక్కడ భూదార్‌ పట్టాల పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో సర్వేకు వెళ్లే ముందు సంబంధిత పట్టాదారులకు తప్పనిసరిగా ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించారు. దీనివల్ల భూ యజమానులు అందుబాటులో ఉండి తమ భూముల హద్దులను నిర్ధారించుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ యజమానుల నుంచి వచ్చే అభ్యంతరాలను నిబంధనల ప్రకారం స్వీకరించి, క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని మంత్రి తెలిపారు. సర్వే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, భూ యజమానులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News