Minister Ponnam prabhakar Comments on Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ పవన్ కళ్యాణ్ సభ తీవ్ర చర్చకు దారితీసింది. సభకు అనుమతించకపోవడంతో హైదరాబాద్‌లోని తన నివాసంలోనే పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన ప్రతి మాటకూ కౌంటర్ ఇస్తూ మంత్రి పొన్నం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ చేసిన తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగీరా? అన్న వ్యాఖ్యలపై మంత్రి పొన్నం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవును.. తెలంగాణ బరాబర్ మా అయ్యా జాగీరే.. ఇక్కడున్న 4 కోట్ల మంది ప్రజల జాగీరే అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ మాటల్లో తీవ్రమైన అహంకారం కనిపించిందని, తెలంగాణ సమాజంపై ఆయనకు ఎందుకంత అక్కసు అని మంత్రి ప్రశ్నించారు. ఏపీలో తన రాజకీయ పరిస్థితి ఏంటో పవన్ కల్యాణ్ తానే స్వయంగా చెప్పుకున్నాడు. తాము ఏపీ ప్రజలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ఏపీ ప్రజలు ఇక్కడ ఉండొద్దని, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని మేము ఎక్కడా అనలేదని గుర్తు చేశారు. అమెరికా వాళ్లే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటే.. పక్కనే ఉన్న ఏపీ వాళ్లు పెడతామంటే మేమెందుకు వద్దంటాం? అని ఆయన ప్రశ్నించారు.
Also read: TGSPC: నిరుద్యోగులకు ఆవిర్భావ దినోత్సవ కానుక.. 290 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
పవన్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్.. బీజేపీ స్క్రిప్టు చదువుతారు..
పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తున్న తీరును తప్పుబడుతూ ఆయనొక పెయిడ్ ఆర్టిస్ట్ అని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, ఆ తర్వాత కానీ ఈ ప్రాంతానికి పవన్ కల్యాణ్ ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా? అని నిలదీశారు. ఇప్పుడు ఆయప మాటలు చూస్తుంటే.. ఈసారి పవన్ కల్యాణ్‌కు బీజేపీ వాళ్లు స్క్రిప్ట్ సరిగ్గా రాసివ్వలేదనుకుంటా అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు పవన్ వచ్చిపోతే మాకు ఎలాంటి సమస్యా లేదని, కానీ ఇక్కడ రాజకీయం చేస్తానంటే ఒప్పుకోమని తేల్చి చెప్పారు. నువ్వు సొంతంగా ఆంధ్రాలోనే సరిగ్గా గెలవలేకపోయావు.. ఇక ఇక్కడికి వచ్చి ఏం పీకుతావ్? అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రజా గాయకుడు గద్దర్ పట్ల గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను, ప్రవర్తనను దళిత సంఘాలు ఒకసారి ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

