Minister Seethakka: రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకోసం కేరళలో కుటుంబశ్రీ మోడల్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సర్వే నిర్వహించిన పేదలను గుర్తించి ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు.
తెలంగాణలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇందుకోసం కేరళలో విజయవంతంగా అమలవుతున్న ‘కుటుంబశ్రీ’ పథకాన్ని మోడల్‌గా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని అనుసరించి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.
‘కుటుంబశ్రీ’ పథకం అమలు కోసం కేరళలో ఒక సర్వే నిర్వహించి.. దాని ద్వారా 65 వేల మంది పేదలను గుర్తించారని సీతక్క చెప్పారు. అర్హులకు ఈ పథకాన్ని అమలు చేసి వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారని వెల్లడించారు. ఆ తరహాలోనే తెలంగాణలోనూ కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక బృందాల ద్వార సర్వే చేయించి.. పేదరికంలో ఉన్న వారిని గుర్తించి జాబితాను రూపొందిస్తామన్నారు.
సర్వే పూర్తయిన అనంతరం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి తగిన ఆర్థిక సాయం అందించి వారికి భరోసా కల్పిస్తామని వివరించారు. ఈ కొత్త పథకంతో ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని.. అయినా అమలు చేస్తామని రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

