Crop Rotation Minister Tummala: రాష్ట్రంలో పంట మార్పిడికి ఇదే సరైన సమయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానశాఖల అధికారులతో సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రైతు కమిషన్ ఛైర్మన్, సభ్యులు.. పంటల మార్పిడిపై నివేదిక అందజేశారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా.. సాంప్రదాయ వరి, పత్తి పంటలకు బదులుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతు కమిషన్ అందించిన నివేదికపై మంత్రి సమీక్షించారు.
Also Read: https://teluguprabha.net/national-news/vck-officially-supports-tvk-to-form-government/
రానున్న మూడేళ్లలో సుమారు 13 లక్షల ఎకరాల్లో పంట మార్పిడి చేపట్టేలా అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. మార్కెట్ అవసరాలను బట్టి ఏ పంటలు వేస్తే రైతులకు లాభం కలుగుతుందో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
‘ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు(మిల్లెట్స్), ఆయిల్‌సీడ్స్ సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వచ్చే ఏడాదిలోనే లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకోవాలి. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్న నేపథ్యంలో, కేంద్ర విత్తన చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. బాధితులకు అందే పరిహారం విషయంలో స్పష్టత ఉండాలి. నకిలీ విత్తనాల అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.’- మంత్రి తుమ్మల
Also Read: https://teluguprabha.net/telangana/bandi-sanjay-son-in-pocso-case/
ఖరీఫ్ కోసం మే నెలాఖరుకల్లా యూరియా నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఇందుకోసం యూరియా సరఫరాలో వేగం పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రాష్ట్రంలో యూరియా సరఫరాలో ఎలాంటి జాప్యం ఉండకూడదన్నారు. ముఖ్యంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే యూరియాలో 90 శాతం వాటాను తెలంగాణకే కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

