Minister Uttam angry with BRS: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తయిందంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలు ముమ్మాటికీ అబద్ధమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జలసౌధలో జరిగిన ఈ భేటీలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు, పనుల పురోగతిపై మంత్రి వారితో చర్చించారు. సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని గత పాలకులు చెప్పడం పచ్చి అబద్ధమని తెలిపారు. ప్రాజెక్టు డిజైన్లను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. కనీసం భూసేకరణ కూడా పూర్తి చేయకుండానే, కేవలం కాల్వల కోసం టెండర్లు పిలిచి కాలయాపన చేశారని మంత్రి మండిపడ్డారు.
Also read: Niharika Konidela: హాట్సాఫ్ బాబాయ్.. పవన్ కల్యాణ్‌పై నిహారిక ప్రశంసల వర్షం..!
15 రోజుల్లో పూర్తి స్థాయి సమీక్షా సమావేశం..
పాలమూరు-రంగారెడ్డి సహా ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, పురోగతి, మిగిలి ఉన్న పనులకు సంబంధించిన సమగ్ర నివేదికను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాబోయే 15 రోజుల్లో పాలమూరు ప్రాజెక్టులపై మరోసారి పూర్తి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తానని, అప్పటిలోపు నివేదికను సిద్ధం చేయాలని కోరారు. జూరాల ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. రాబోయే వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

