Minister Uttam comments on Grain procurement: దేశంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసింది తెలంగాణ రాష్ట్రమేనని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణకు క్షేత్రస్థాయిలో 13వేల వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది సిబ్బంది ధాన్యం సేకరణలో పాల్గొంటున్నారని చెప్పారు. ఇప్పటికే ధాన్యం సేకరణ కేంద్రాలకు 20.86 కోట్ల గన్నీ బ్యాగులు పంపామన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రూ.11,050 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని వివరించారు. సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Also read: AP PGCET Results: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..!
ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మొద్దు..
‘‘ధాన్యం సేకరణకు బీహార్, బెంగాల్ కార్మికులపై ఆధారపడి ఉన్నాం. బెంగాల్ ఎన్నికలకు కార్మికులు స్వస్థలాలకు వెళ్లి రావడం ఆలస్యమైంది. మద్దతు ధర కోసం మా ప్రభుత్వం రూ.49 వేల కోట్లు వెచ్చించగా.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రూ.10 వేల కోట్లే ఇచ్చింది. ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఈ మాట కేంద్రమే చెప్పింది. గతంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేసిన కొనుగోళ్ల కంటే ఇప్పుడు ఎక్కువగా కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికంటే అదనంగా కొనుగోలు చేశాం. దీని కోసం ఏకంగా రూ.16,479 కోట్ల మేర ఖర్చు చేశాం. రాష్ట్రంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత మాది.’’ అని రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

