HomeతెలంగాణIrrigation: ప్రతి నీటి చుక్కకూ లెక్క ఉండాలి: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Irrigation: ప్రతి నీటి చుక్కకూ లెక్క ఉండాలి: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌ (తెలుగుప్రభ) : ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాకాలంపై అనిశ్చితి కొనసాగుతున్నందున ప్రతి నీటి చుక్కనూ వినియోగించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటి భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తూనే అందుబాటులో ఉన్న నీటితో ఖరీఫ్‌ పంటలకూ భరోసా కల్పించాలని సూచించారు. భవిష్యత్తులో భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వస్తాయన్న అంచనాల ఆధారంగా కాకుండా.. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నిల్వలు, నమ్మదగిన ప్రవాహాలు, వాస్తవిక వర్షపాత అంచనాల ఆధారంగానే నీటి విడుదలపై నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మంగళవారం జలసౌధలో రాష్ట్రంలోని జలాశయాల నీటిమట్టాలు, ప్రవాహాలు, మిగిలిన ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీటి అవకాశాలపై అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జలాశయాల వారీగా నీటి లభ్యత, సాగు, తాగునీటి అవసరాలు, రాబోయే రోజుల్లో వచ్చే ప్రవాహాలపై అధికారులు వివరాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రతి జలాశయంలోని స్థూల నిల్వలతోపాటు లైవ్‌ స్టోరేజ్‌, వాస్తవంగా వినియోగించగలిగే నీరు, ఇప్పటికే కేటాయించిన అవసరాలను పరిగణనలోకి తీసుకొని సాగునీటికి అందుబాటులో ఉండే నీటిని స్పష్టంగా లెక్కించాలని మంత్రి ఆదేశించారు.

- Advertisement -

కృష్ణా పరీవాహకంలో 973 టీఎంసీల నిల్వ
కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రధాన జలాశయాల్లో 973.68 టీఎంసీల సామర్థ్యానికి గాను 746.12 టీఎంసీల నీరు ఉన్నట్లు సమీక్షలో వెల్లడైంది. దీంతో కృష్ణా బేసిన్‌లో 76.63 శాతం నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి బేసిన్‌లో 306.20 టీఎంసీల సామర్థ్యానికి గాను 208.38 టీఎంసీలు అంటే 68.1 శాతం నిల్వలు ఉన్నట్లు వివరించారు. అయితే, ఈ శాతాలను చూసి పరిస్థితి పూర్తిగా ఆశాజనకంగా ఉందనే భావనకు రావొద్దని మంత్రి ఉత్తమ్ సూచించారు. స్థూల నిల్వల కంటే వాస్తవంగా వినియోగించగల నీటి పరిమాణమే కీలకమన్నారు. 2025, 2026 సంవత్సరాల నిల్వలు, ప్రవాహాలను పరిశీలించి నీటి విడుదలపై నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం సుమారు 164 టీఎంసీల నీరు ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు స్థూల సామర్థ్యం సుమారు 312 టీఎంసీలు కాగా, మరో 47 శాతం మేర వరద జలాలను స్వీకరించే అవకాశం ఉందని వివరించారు. సాగర్‌ ఎడమ కాలువ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6.4 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్నందున సాగునీటి అవసరాలను అత్యంత జాగ్రత్తగా అంచనా వేయాలని మంత్రి సూచించారు.

పంటలనూ కాపాడాలి
మిగిలిన ఖరీఫ్‌ సీజన్‌లో నమ్మదగిన ప్రతి నీటి వనరులను సద్వినియోగం చేసుకొని పంటలను కాపాడాలని మంత్రి ఉత్తమ్‌ సూచించారు. ప్రవాహాలపై అనిశ్చితి ఉన్న జలాశయాల్లో నీటిని పొదుపుగా వినియోగించాలని, ప్రత్యామ్నాయ వనరుల నుంచి తిరిగి నింపుకొనే అవకాశం ఉన్న చోట సాగునీటిని అనవసరంగా నిలిపివేయొద్దన్నారు. వైరా రిజర్వాయర్‌ పరిస్థితిని మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. గోదావరి జలాలతో తిరిగి నింపుకునే అవకాశం ఉన్నప్పుడు సాగునీటి విడుదలలో జాప్యం ఎందుకు జరుగుతోందని అధికారులను ప్రశ్నించారు. రైతులకు అవసరమైన సమయంలో నీరు అందేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. దేవాదుల, నిజాంసాగర్‌, స్వర్ణ, సదర్మాట్‌, రామడుగు, బుగ్గలవాగు, రామపల్లి, పాలెంవాగు, గౌరవరం, పోచారం, రాజీవ్‌సాగర్‌, నెలవాయి, వట్టివాగు, నల్లవాగు తదితర ప్రాజెక్టుల నీటి పరిస్థితినీ సమీక్షించారు. ఎక్కడ సాగునీరు విడుదల చేసే అవకాశం ఉందో గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మూసీ జలాలను సమర్థంగా వినియోగించి రైతులకు ప్రయోజనం కల్పించాలని సూచించారు. శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, లోయర్‌ మానేరు డ్యామ్‌, సింగూరు తదితర ప్రాజెక్టుల పరిస్థితినీ సమగ్రంగా పరిశీలించారు. సింగూరు ప్రాజెక్టు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన మరమ్మతులు, పటిష్టీకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో వేగం పెంచాలి
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల పురోగతినీ మంత్రి సమీక్షించారు. ఇన్‌లెట్‌, అవుట్‌లెట్‌ రెండు వైపుల నుంచి తవ్వకం కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల్లో ఇంజినీర్లు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, భద్రత విషయంలో రాజీపడకుండా పనుల వేగాన్ని పెంచాలని ఉత్తమ్‌ ఆదేశించారు. జలవనరులకు సంబంధించిన సాంకేతిక అధ్యయనాల్లో కేంద్ర జల సంఘం, భారత వాతావరణ శాఖ తాజా సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. నదుల క్రాస్‌ సెక్షన్లను తాజా పరిస్థితులకు అనుగుణంగా నవీకరించాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఏర్పడే అవకాశం ఉన్న ముంపు ప్రభావంపై ఐఐటీ నిపుణులతో త్వరితగతిన తదుపరి సంప్రదింపులు జరపాలని సూచించారు. తెలంగాణలో ఎంత మేర వరద ప్రభావం లేదా ముంపు ఏర్పడే అవకాశం ఉందన్న అంశంపై శాస్త్రీయ, పటిష్ఠమైన సాంకేతిక ఆధారాలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన రక్షణ చర్యల కోసం కేంద్రాన్ని కోరేందుకు ఈ అధ్యయనం బలమైన ఆధారంగా ఉండాలని పేర్కొన్నారు.

జల వివాదాలపైనా సమీక్ష
అంతర్రాష్ట్ర జల వివాదాలపైనా మంత్రి విస్తృతంగా సమీక్షించారు. ట్రిబ్యునల్‌లో కొనసాగుతున్న విచారణలు, సుప్రీంకోర్టులో ఉన్న కేసులు, కృష్ణా జలాల నిర్వహణ, విద్యుదుత్పత్తి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి తదితర అంశాలపై ఇంజినీరింగ్‌, న్యాయ విభాగాల అధికారులు సమన్వయంతో సమగ్ర నోట్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. సమీక్షలో నీటి పారుదల శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఓ.వి.రమేశ్ బాబు, జాయింట్‌ సెక్రటరీ కె.శ్రీనివాస్‌, టన్నెల్‌ నిపుణుడు కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్రా, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ టి.శ్రీనివాస్‌, ఆర్‌.మధుసూదన్‌రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News