మహబూబాబాద్, అక్టోబర్ 5 (తెలుగు ప్రభ): నెల్లూరు జిల్లా నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన ఇద్దరు బాలలను మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీసులు సోమవారం గుర్తించారు. అనంతరం నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. దంతాలపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన ఎల్లంపల్లి వెంకటేష్ (12), ఎల్లంపల్లి వెంకటేశ్వర్లు (10) అనే ఇద్దరు బాలురు సెప్టెంబర్ 26న చేపలు పట్టేందుకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో దారి తప్పి కనిపించకుండా పోయారు.
బాలల ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులు నవాబుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు బాలల అదృశ్యంపై కేసు నమోదు చేశారు. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం దంతాలపల్లి సెంటర్‌లో ఇద్దరు బాలురు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని పోలీసులు గమనించారు. వారిని ఆపి వివరాలు తెలుసుకున్నారు. వారు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన చిన్నారులుగా గుర్తించారు.
వెంటనే బాలలను దంతాలపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. నవాబుపేట పోలీసులు మంగళవారం ఉదయం దంతాలపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. బాలలను గుర్తించడంలో అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన పీసీ-2471, పీసీ-05లను దంతాలపల్లి ఎస్‌ఐ అభినందించారు.

