Harish Rao comments on Kishan Reddy కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రాజ్యసభలో కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారానికి ప్రతిరూపమని విమర్శించారు. ఈ మేరకు ‘X’ వేదికగా హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.
Also Read: https://teluguprabha.net/telangana/poultry-owners-clarity-on-chicken-retailers-strike/
ఎగువ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టులా ఉందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ‘రాజ్యసభలో పలికింది కిషన్ రెడ్డి అయితే, పలికించింది మాత్రం రేవంత్ రెడ్డి.’ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ చేస్తున్న ఆరోపణలనే కిషన్ రెడ్డి పార్లమెంటులో పునరావృతం చేయడం చూస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న “చీకటి పొత్తుకు” నిదర్శనమని ఆయన ఆరోపించారు.
‘విభజన చట్టం ప్రకారం ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అబద్ధం. అది చరిత్రను వక్రీకరించడమే. ఉద్యమం సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చి, మీరు చేసిన ద్రోహాన్ని ఎండగట్టిన విషయాన్ని మరిచిపోయారా.?. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదని కిషన్ రెడ్డి అనడం అవివేకం. మండుటెండల్లో కూడా కాళేశ్వరం నీళ్లు పొలాలకు పారుతున్నాయి. దమ్ముంటే నాతో కలిసి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.’ అని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/dy-cm-pawan-kalyan-abour-amaravati-capital/
బీజేపీ, కాంగ్రెస్ తరఫున రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలు ఉన్నా.. తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడకుండా రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

