MLA Kaushik Reddy insulted CP: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారిపై చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. దీంతో, సోషల్ మీడియాలో ఆయనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయనపై వస్తున్న విమర్శలకు వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు కోరారు. కరీంనగర్ సీపీని కులం పేరుతో దూషించడంపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ.. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. పోలీసు అధికారులపై తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కావని పాడి కౌశిక్ రెడ్డి నేడు వివరణ ఇచ్చారు. ఒకవేళ, ఆ మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ వివాదాన్ని కొందరు అనవసరంగా పెద్దది చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్రస్టేషన్‌తోనే అలా అనాల్సి వచ్చింది..
ఈ వివాదం వెనుక గల కారణాలను వివరిస్తూ.. తాము కుటుంబంతో కలిసి సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్తున్న సమయంలో కొందరు అధికారులు కావాలని తమను అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో తీవ్రమైన ఒత్తిడి, ఫ్రస్ట్రేషన్ కారణంగానే నోరు జారానని, అంతేతప్ప పోలీసు వ్యవస్థ అన్నా, అధికారులన్నా తనకు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే తనపై, తన కుటుంబంపై రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కొందరు వ్యక్తులు పనిగట్టుకొని ఈ విషయాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని, ఈ వివాదాన్ని ఇకపై సాగదీయకుండా ఇంతటితో ముగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత కొద్దిరోజులుగా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు పోలీసులు నిరసన తెలపడంతో కౌశిక్ రెడ్డి దిగి వచ్చారు. క్షమాపణలు చెబుతూ వివాదానికి పులిస్టాప్ పెట్టారు.

