Kavitha Comments: బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తొలి మెట్టుగా భావిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వైఫల్యం వల్లే కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు వచ్చాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు తమను ఆశీర్వదించారని.. ఎన్నికల ఫలితాలు తమకు సంతోషాన్ని ఇచ్చాయని వెల్లడించారు.
వడ్డేపల్లిలో తమకు పూర్తి ఆధిక్యం వచ్చినా.. అధికార పార్టీ, ఇతరులు ప్రలోభాలకు గురిచేశారని కవిత ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు 40కి పైగా స్థానాల్లో జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలతో ప్రజలు తమను ఆదరిస్తారని నమ్మకం కలుగుతోందన్నారు. బీఆర్‌ఎస్‌కు 16 మున్సిపాలిటీలు రావడమే ఎక్కువ అన్నట్లుగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు తానే రాజు- తానే మంత్రి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. ముందు హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు.
‘మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ట్రైలర్ మాత్రమే.. పిక్చర్ ఇంకా ముందుంది. తొందరపడి కారు కూతలు కూయొద్దు. తప్పులను సరిదిద్దుకొని ప్రజల్లో ఉండాలని బీఆర్‌ఎస్ నేతలకు, కార్యకర్తలకు సూచిస్తున్నా. బీఆర్‌ఎస్ ఎన్ని మున్సిపాలిటీలు కోల్పోయిందో ఆలోచించాలి. నిజామాబాద్ సహా అన్ని చోట్లా పూర్తిగా కేడర్‌ను వదిలిపెట్టింది. కేటీఆర్, మాజీ మంత్రులు ఎన్ని చోట్ల పోరాటం చేశారు.? కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ ఎక్కడ పోరాటం చేస్తోంది.? కరీంనగర్‌లో మినహాయిస్తే బీజేపీ ఎక్కడా పట్టు సాధించలేదు.’ – కవిత
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-about-state-budget/
గతంలో సీపీఐ, సీపీఎంలను తోక పార్టీలు అనే వారని కవిత గుర్తు చేశారు. ఇప్పుడు తోకపార్టీలకు తోక పార్టీగా బీఆర్‌ఎస్ మారుతోందని ఎద్దేవా చేశారు. సింగరేణి కుంభకోణంపై సీపీఐ, ఏఐటీయూసీ కనీసం నోరు కూడా విప్పడం లేదని ఆరోపించారు. కూనంనేని సాంబశివరావు కాళేశ్వరం విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై ఏం మాట్లాడారో కేటీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. సింగరేణి ఎన్నికల్లో జాగృతి- హెచ్‌ఎంఎస్ కలిసి పోటీ చేసి సత్తా చాటుతామని కవిత ధీమా వ్యక్తం చేశారు.

