Telangana Floods: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా.. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రైల్వే పట్టాలపైకి వరదనీరు ఉప్పొంగి చేరడంతో పట్టాలన్నీ పూర్తిగా మునిగిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు తక్షణమే స్పందించి.. పలు రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపివేశారు. డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయగా.. మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశారు. పట్టాలపై వరద ఉధృతి తగ్గేవరకు రైళ్ల రాకపోకలు పునరుద్ధరించబడే అవకాశం లేదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని తగ్గించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
పాఠశాలలకు సెలవు: మొంథా తుపాన్ నేపథ్యంలో మహబూబ్‌నగర్ డీఈవో ప్రవీణ్ కుమార్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాద్ జిల్లాలో సైతం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతో నేడు జరగనున్న త్రైమాసిక పరీక్షలు వాయిదా పడ్డాయి. ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సైతం ఆ జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, ఇలా త్రిపాఠి సెలవు ప్రకటించారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/cyclone-montha-effect-on-hyderabad/
హైదరాబాద్‌లో రోడ్లన్నీ జలమయం: ‘మొంథా’ తుపాను ప్రభావంతో భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి మొదలైన వర్షం బుధవారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యాట్నీ, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుత్బుల్లాపూర్, గాజులరామారం, కూకట్‌పల్లి, మియాపూర్, నిజాంపేట ప్రాంతాల్లోనూ వర్షం కొనసాగుతోంది. రాబోయే రెండు గంటల వ్యవధిలో నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

