Wine Shops Bandh: తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-chit-chat-in-delhi-visit-comments-on-ex-cm-kcr/
రాష్ట్రంలో ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు చోట్ల మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. రేపు కౌంటింగ్ జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు వైన్ షాపులను మూసివేయనున్నారు. వైన్ షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లలో మద్యం సరఫరా బంద్ కానుంది. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫిబ్రవరి 11 న ‘పుర’ ఎన్నికలు జరగ్గా.. శుక్రవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 73.01 పోలింగ్ శాతం నమోదు కాగా.. కార్పొరేషన్లలో 66.05 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తంగా 38,09,406 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, ఈ నెల 16న కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికనూ అదే రోజు నిర్వహిస్తారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరగ్గా.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మద్యం ఏరులై పారగా.. డబ్బులు ఇష్టారీతిన పంచిపెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటగా.. మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోలింగ్స్‌లోనే అధికార పార్టీ హవానే కొనసాగింది. త్రిముఖ పోరుతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తవరంగా సాగాయి. మరి ఈ ప్రధాన పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు దక్కాయనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

