Homeతెలంగాణఆదిలాబాద్Muthol: ప్రతిభకు పట్టాభిషేకం.. గురువులకు ఘన సత్కారం

Muthol: ప్రతిభకు పట్టాభిషేకం.. గురువులకు ఘన సత్కారం

  • ప్రతిభకు పట్టాభిషేకం.. గురువులకు ఘన సత్కారం
  • ఎంబీబీఎస్‌, ఎన్‌ఐటీ, ఐఐటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు అభినందన
  • 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
  • ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

ముథోల్, అక్టోబర్ 9 (తెలుగు ప్రభ): సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. భైంసాలోని ఎస్‌ఎస్‌ జిన్నింగ్ ఇండస్ట్రీలో అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్‌ సీట్లు సాధించిన 30 మంది విద్యార్థులను, ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందిన ఆరుగురు విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. అలాగే 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

- Advertisement -

నియోజకవర్గ విద్యార్థులు వైద్య విద్యలో సీట్లు సాధించడంతోపాటు జాతీయ స్థాయి సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందడం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ముథోల్‌లో సుమారు రూ.300 కోట్లతో సమీకృత పాఠశాల నిర్మాణానికి, కుంటాల మండలంలోని మోడల్ స్కూల్‌ను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చేందుకు రూ.9 కోట్ల నిధులు మంజూరయ్యేలా కృషి చేసినట్లు వివరించారు. విద్య, వైద్యం, రైతాంగానికి సాగునీరు అందించడం తన ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి భోజన్న, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మున్సిపల్ చైర్మన్ తుమ్మొల్ల దత్తాత్రి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, నాయకులు రమణరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News