Kethepalli Police Station: నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వివిధ కేసుల్లో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దీంతో స్టేషన్ పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయి.
సకాలంలో స్పందించిన సిబ్బంది: ప్రమాదాన్ని గమనించిన కేతేపల్లి పోలీస్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానిక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అగ్నిమాపక యంత్రంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి.
Also read-Siddipet: బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్.. కంగుతిన్న మందుబాబు!
తప్పిన పెను ప్రమాదం: పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడంతో ఒక పెను ప్రమాదం తప్పింది. మంటలు పోలీస్ స్టేషన్ ప్రధాన భవనానికి వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. లేనిపక్షంలో రికార్డులు, ఇతర కీలక వస్తువులు కాలి బూడిదై భారీ నష్టం వాటిల్లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న కేతేపల్లి పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

