పెన్ పహాడ్ (తెలుగుప్రభ): ప్రభుత్వ పాఠశాల అంటే కేవలం తరగతి గదులు మాత్రమే కాదు.. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం, మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటేనే నేడు నాణ్యమైన విద్య సాధ్యమవుతుంది. ఈ ఆలోచనతో మండలంలోని దోసపహాడ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, దాతలు పెద్దఎత్తున చేయూతనందించి దాతృత్వం చాటుకుంటున్నారు. మొత్తం సుమారు రూ.41 లక్షలతో పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు కళావేదిక, తాగునీరు, సీసీ కెమెరాలు, స్మార్ట్ టీవీ, క్రీడా సామగ్రి, గదులలో తదితర సదుపాయాలు సమకూర్చారు.
రూ.21 లక్షలతో అదనపు గదులు..
గ్రామానికి చెందిన దాత దొంగరి మురళి–సుగుణ దంపతుల కుమారులు, పూర్వ విద్యార్థులు, హయత్ నగర్ కృష్ణవేణి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం, ప్రముఖ వైద్యులు డా. ప్రవీణ్, సోదరుడు డా. ప్రమోద్ కలిసి రూ.21 లక్షల వ్యయంతో పాఠశాలలో రెండు అదనపు తరగతి గదులను నిర్మించారు. వీటిని సోమవారం కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రావు కలసి ప్రారంభించనున్నారు. మరో రూ.20 లక్షలతో మౌలిక సదుపాయాలు పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం పలువురు దాతలు మరో రూ.20 లక్షల వరకు సమకూర్చారు. దీంతో పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు తమకు చదువు నేర్పిన పాఠశాలకు తిరిగి తమ వంతు సహకారం అందించడం ఆదర్శంగా నిలుస్తోంది.
గ్రామం కోసం దొంగరి మురళి కుటుంబం సేవలు..
అదనపు గదుల దాత దొంగరి మురళి, ఆయన సోదరులు మట్టయ్య, జగపతిరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం తమ భూమిలో నాలుగు ఎకరాలను భూదానం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం లిఫ్ట్ కాలువ ఏర్పాటుకు వారు సహకరించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రామస్థుల కోసం గ్రామంలో ఇళ్ల స్థలాలకు కొరత ఉన్న సమయంలో సుమారు 15 ఎకరాల వ్యవసాయ భూమిని గ్రామ పంచాయతీకి ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. పరిహారం విషయంలో న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్నప్పటికీ, గ్రామస్తుల ప్రయోజనాల దృష్ట్యా కేసును కూడా వదులుకున్నట్లు చెప్పారు. దొంగరి మురళి కుటుంబం దానగుణానికి ఇది నిదర్శనమని గ్రామస్తులు పేర్కొన్నారు.
కళావేదికకు రూ.2.50 లక్షలు..
కొండేటి జానకిరెడ్డి–మంజుల దంపతులు పాఠశాల ఆవరణలో రూ.2.50 లక్షలతో కళావేదికను ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ వేదిక ఉపయోగపడనుంది.
గోడలపై విజ్ఞాన చిత్రాలు.. విద్యార్థులకు క్రీడా దుస్తులు..
నాగేష్‌వర్మ–రామానుజమ్మ దంపతులు రూ.51 వేలతో పాఠశాల గేట్లు, గోడలకు సైన్స్‌కు సంబంధించిన బొమ్మలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు క్రీడా దుస్తులు సమకూర్చారు. శుద్ధి చేసిన నీటి కోసం వాటర్ ప్లాంట్
విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు పాఠశాలలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ దాత దొంగరి మంగయ్య–కవిత దంపతులు రూ.50 వేలు అందించారు.
స్మార్ట్ టీవీ.. నీతిసూక్తులు..
ప్రముఖ బిల్డర్ శిరస్సు నగేష్–రేణుక దంపతులు విద్యార్థుల కోసం స్మార్ట్ టీవీ, టీషర్ట్‌లతో పాటు పాఠశాల ఆవరణలోని భారీ వృక్షాల చుట్టూ రంగులతో నీతిసూక్తులు ఏర్పాటు చేసేందుకు రూ.56 వేలు అందించారు.
ప్రతిభకు ప్రోత్సాహం..
తెలంగాణ అమరుడు కొండేటి వేణుగోపాల్‌రెడ్డి సోదరుడు, ప్రముఖ శాస్త్రవేత్త కొండేటి శ్రీనివాస్‌రెడ్డి గ్రామంలో పదో తరగతి, ఏడో తరగతిలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు నాలుగేళ్లకు సరిపడే రూ.1.50 లక్షల వరకు ప్రోత్సాహక నగదు అందిస్తామని ప్రకటించి, ఆ మొత్తాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు.
భద్రత కోసం సీసీ కెమెరాలు..
పాఠశాల భద్రత కోసం కొడదల లక్ష్మణ్–విశాల దంపతులు రూ.30 వేలు విరాళంగా అందించి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించారు. తాగునీటి అవసరాల కోసం బోరు, పంపుసెట్ ఏర్పాటుకు దాత దొంగరి శంకర్‌రావు రూ.35 వేలు అందించారు.
ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చుతోనూ అభివృద్ధి..
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిండిగి నర్సయ్య పాఠశాల నేమ్‌బోర్డును ఏర్పాటు చేశారు. స్థానిక ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత మామిడి వెంకన్న, సామజిక కార్యకర్త గద్దల నాగయ్య పాఠశాల గోడలపై ప్రముఖుల చిత్రాలు, ఆంగ్ల అక్షరాలు, వివిధ విద్యా చిత్రాలను ఏర్పాటు చేశారు. మరికొందరు దాతలు తరగతి గదుల్లో మౌలిక సదుపాయాల కోసం సొంతంగా ఖర్చు చేసి పాఠశాల అభివృద్ధికి తోడ్పడ్డారు.
సేవే స్ఫూర్తిగా..
ప్రభుత్వ పాఠశాలలో చదివి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తిరిగి చేయూతనందించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కరు ఒక్కో సదుపాయం కల్పించడంతో పాఠశాల విద్యార్థులకు మెరుగైన వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్థులు ముందుకొస్తే పాఠశాల మరిన్ని హంగులతో సౌకర్యవంతంగా మారుతాయని గ్రామస్తులు పేర్కొన్నారు.
మంచి ఆహ్లాదంలో చదువు అందించాలన్నదే లక్ష్యం..
మేము చదువుకున్న పాఠశాలకు మా వంతు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో రూ. 21 లక్షలతో రెండు అదనపు గదులు నిర్మిచాం. గ్రామంలోణి పిల్లలకు మంచి వాతావరణంలో చదువు అందాలన్నదే మా కుటుంబం ఆకాంక్ష. మంచి మనస్సుతో సర్కారు బడి అభివృద్ధికి మరింత మంది ముందుకు రావాలని అదనపు గదుల దాత దొంగరి మురళి అన్నారు.
దాతల సహకారంతో పాఠశాలకు కొత్త కళ..
మామిడి వెంకన్న – స్థానిక, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు గతంలో ఈ పాఠశాలలో ఎస్ఎస్‌ఏ ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సహాయంతో రూ.13 లక్షల వ్యయంతో నాలుగు తరగతి గదులు నిర్మించారు. వాటిలో ఒక గదిని హెచ్‌ఎం, స్టాఫ్ అవసరాలకు వినియోగిస్తున్నాం. దీంతో విద్యార్థులకు తరగతి గదులు సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యను అధిగమించేందుకు స్థానిక బంధువులు, సహచర మిత్రులు, క్లాస్‌మేట్స్‌తో పాటు సామాజిక కార్యకర్త గద్దల నాగయ్య సహకారం అందించారు. దాతల సహకారంతో సుమారు రూ.41 లక్షలు సమీకరించి పాఠశాలలో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాం. అందరి సహకారంతో నేడు పాఠశాల కొత్త కళను సంతరించుకుంది. విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో విద్య అందించేందుకు ఈ సహకారం ఎంతో ఉపయోగపడుతోంది.

