Homeతెలంగాణనల్లగొండMarriguda: మరణం విడదీయని జన్మజన్మల బంధం ఇది!

Marriguda: మరణం విడదీయని జన్మజన్మల బంధం ఇది!

  •  మరణం కూడా విడదీయలేని జన్మజన్మల బంధం!
  • భర్త లేని లోకాన్ని భరించలేక
  • భర్త పెద్దకర్మనాడే తనువు చాలించిన భార్య
  • నూరేళ్ల ఆయువును పంచుకున్న జంట
  •  పరలోక ప్రయాణంలోనూ ఒకరివెంట ఒకరు!

మర్రిగూడ(తెలుగుప్రభ): నూరేళ్ల ఆయుష్షుతో..కడవరకు నీడలా తోడుంటానని,ఏడడుగుల బంధంతో ఒక్కటైన ఆ దంపతుల ప్రయాణం అసాధారణమైనది.భర్త భౌతికంగా దూరమైనా,ఆ వియోగాన్ని మనసు భరించలేకపోయిందో ఏమో..సరిగ్గా ఆయన పెద్దకర్మ నాడే ఆ భార్య కూడా అనంత లోకాలకు పయనమైంది.మరణం కూడా విడదీయలేని ఆ నిజమైన ప్రేమ ప్రయాణం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో అందరి హృదయాలను బరువెక్కిస్తోంది.గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ విషాద గాథ గురించే చర్చ జరుగుతోంది.

- Advertisement -

విధి ఆడిన వికృత క్రీడ..
పుల్లెంల గ్రామానికి చెందిన మొగుదాల పెంటయ్య కొంతకాలం క్రితం కాలం చేశారు.జీవితాంతం పక్కనే ఉండి నడిపించిన భర్త ఇకలేరనే సత్యం ఆ భార్య మొగుదాల సాలమ్మ గుండెను పిండేసింది.భర్త జ్ఞాపకాలతో కుమిలిపోతూ,ఆయన లేని లోకాన్ని నూకలు లెక్కపెడుతూ ఆమె పడిన మనోవేదన వర్ణనాతీతం.కుటుంబ సభ్యులు అన్ని లాంఛనాలు ముగించి,గురువారం పెంటయ్య దశదిన కర్మ(పెద్దకర్మ)నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.భర్త ఆత్మశాంతి కోసం జరగాల్సిన ఆఖరి కార్యక్రమానికి భార్య సాలమ్మ ఒంటరిగా అన్నీ తానై ఉండి నడిపించాల్సిన దుస్థితి.​కానీ,విధి మరోలా తలచింది.భర్త లేకుండా బతకడం ఆ భార్యకు నూరేళ్ల నరకంగా అనిపించింది.భర్త పెద్దకర్మ నిర్వహించాల్సిన పవిత్రమైన రోజే..సరిగ్గా అదే ఉదయం సాలమ్మ కూడా గుండె పగిలి ప్రాణాలు విడిచింది.భర్త పోయిన దుఃఖాన్ని కొద్దిరోజులు కూడా దిగమింగుకోలేకపోయిన ఆ సాద్వీమణి,సరిగ్గా ఆయన కర్మదినంనాడే ప్రాణాలు వదలడం స్థానికులను కంటతడి పెట్టించింది.

కన్నీటి సంద్రంలో పుల్లెంల గ్రామం..
ఒకరి వెనుకే ఒకరుగా దంపతులిద్దరూ కొద్దిరోజుల వ్యవధిలోనే విగతజీవులుగా మారడంతో ఆ ఇంట తీరని విషాదం అలుముకుంది.కన్నబిడ్డలు,బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఎదుర్కొన్న ఆ అన్యోన్య దంపతులు..మరణంలోనూ విడిపోకుండా ఒకరి వెంట ఒకరు పరలోకానికి వెళ్లిపోయారు.అంటూ గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.​చావు పుట్టుకలు దేవుడి చేతిలో ఉంటాయంటారు కానీ, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజమైన బంధాలు మరణాన్ని కూడా జయిస్తాయనిపిస్తుంది.పెంటయ్య,సాలమ్మల అమర ప్రేమానికి నివాళులు అర్పిస్తూ..వారి ఆత్మకు శాంతి చేకూరాలని గ్రామస్థులు ప్రార్థిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News