New EHS in Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ పేరుతో కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ స్కీమ్‌ను ప్రభుత్వమే నేరుగా నిర్వహించనుంది. ఈమేరకు సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగుల కోసం గతంలో ఉన్న ఇన్సూరెన్స్ మోడల్‌కు సర్కార్ స్వస్తి చెప్పనుంది. కొత్తగా హెల్త్ స్కీమ్‌ను ప్రవేశపెట్టి ‘ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్'(EHCT) ద్వారా ప్రభుత్వమే నేరుగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం నిర్వహించారు. కొత్త ఆరోగ్య పథకంపై విధివిధానాలను చర్చించారు.
Also Read: https://teluguprabha.net/telangana/ex-mlc-kavitha-comments-on-cm-revanth-reddy/
ఈ కొత్త స్కీమ్‌లో భాగంగా ఉద్యోగులు తమ మూల వేతనంలో 1.5 శాతం మొత్తాన్ని చెల్లించాలి. ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని తన వంతుగా చెల్లించేలా ట్రస్ట్ నిర్ణయించింది. ఈ కొత్త స్కీమ్ ద్వారా ఏటా ఉద్యోగులు రూ. 528 కోట్లు చెల్లిస్తుండగా.. ప్రభుత్వం కూడా తన వాటాగా అంతే చెల్లించనుందని ట్రస్ట్ అంచనా వేసింది.
కొత్తగా తీసుకువస్తున్న ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ స్కీమ్.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.44 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన 12.84 లక్షల మంది కుటుంబ సభ్యులకు వర్తించనుంది. నగదురహిత వైద్య సేవల కోసం ఇప్పటివరకూ 515 ఆస్పత్రులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇక, పక్క రాష్ట్రాల్లో అత్యవసర చికిత్స పొందినప్పుడు ఈహెచ్‌ఎస్ వర్తింపజేసే విషయంపైనా పరిశీలించనున్నారు.
EHCT ప్రయోజనాలు:
EHCT ద్వారా నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ వైద్య సేవలను ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబీకులు పొందవచ్చు. దీంతో పాత పద్ధతిలో ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ జాప్యాన్ని నివారించి.. ఆసుపత్రుల బిల్లులను ట్రస్ట్ ద్వారా త్వరితగతిన చెల్లించేలా చర్యలు చేపట్టనున్నారు. క్లాస్-IV ఉద్యోగుల నుంచి గెజిటెడ్ అధికారుల వరకు అందరికీ ఈ స్కీమ్ ఒకే విధంగా వర్తిస్తుందని ట్రస్ట్ తెలిపింది. రాబోయే 15 రోజుల్లో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విధివిధానాలు..
ఈ ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ట్రస్ట్ సీఈఓగా నియమిస్తారు. ఇందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు రూపొందించనున్నారు. భవిష్యత్తులో అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నట్లు సీఎస్ తెలిపారు. ఈహెచ్‌ఎస్ పథకం ప్రారంభమైన తర్వాత.. ప్రభుత్వ రంగ సంస్థలు, మోడల్ స్కూల్స్, గురుకులాల సిబ్బందిని చేర్చడంపై తీర్మానం చేయనున్నారు. ఈ కార్యకమంలో ఉన్నతాధికారులు సీవీ ఆనంద్, మహేష్ దత్ ఎక్కా, సందీప్ కుమార్ సుల్తానియా, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

