Nizam Jewellery Permanent Exhibition Status : నాడు ప్రపంచ కుబేరుడి గడపలో కాంతులు విరజిమ్మిన ఆభరణాలు.. నేడు ఇనుప గదుల మధ్య నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. కోట్లాది మంది కళ్లు చూడాలని తపిస్తున్నా, ఆ అదృష్టం మాత్రం అప్పుడప్పుడూ తప్ప దక్కడం లేదు. అదే నిజాం నవాబుల అపురూప నగల సంచయం. జాకబ్ డైమండ్ మెరుపులు, బస్రా ముత్యాల కాంతులు, పచ్చలు, కెంపుల హారాలు.. ఇలా ఒక్కటేమిటి, ఒక చరిత్రే అక్కడ బందీ అయి ఉంది. 1995 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాల్ట్ లో భద్రంగా ఉన్న ఈ నగలను తిరిగి హైదరాబాద్‌కు తీసుకొస్తారా? అసలు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమంటోంది..? ఈ అపార సంపదను సందర్శించే భాగ్యం సామాన్యులకు ఎప్పుడు కలుగుతుంది..? రాజ్యసభలో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
ఆర్బీఐ వాల్ట్ లోనే ‘నిజాం’ నిధి – కేంద్రం వెల్లడించిన వాస్తవాలు : రాజ్యసభలో నిజాం నగలపై అడిగిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
1995 నుంచి ఆర్బీఐ ఆధీనంలో: హైదరాబాద్ విలీనం తర్వాత నిజాం ఆస్తులపై సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది. చివరకు 1995లో భారత ప్రభుత్వం నిజాం వారసుల నుంచి 173 రకాల ఆభరణాలను రూ. 218 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ నగలు ఢిల్లీలోని ఆర్బీఐ లాకర్లలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నాయి.
హైదరాబాద్‌కు తరలింపుపై సందిగ్ధం: ఈ ఆభరణాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి శాశ్వత ప్రదర్శనకు ఉంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. వీటి చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత దృష్ట్యా భద్రతపరమైన కారణాల వల్ల వీటిని అత్యంత జాగ్రత్తగా ఉంచాల్సి వస్తోందని ప్రభుత్వం పేర్కొంది.
ప్రపంచంలోనే అరుదైన ‘జాకబ్ డైమండ్’: ఈ సేకరణలో ప్రధాన ఆకర్షణ ‘జాకబ్ డైమండ్’. 184.7 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నాటి నిజాం నవాబు ఇంతటి విలువైన వజ్రాన్ని కేవలం తన టేబుల్ మీద ‘పేపర్ వెయిట్’గా వాడేవారట! ఇప్పుడు దీని విలువ వేల కోట్లలో ఉంటుందని అంచనా. వీటితో పాటు 465 ముత్యాలతో కూడిన ఏడుతీగల బస్రా ముత్యాల హారం కూడా ఈ నిధిలో ప్రత్యేకం.
మూడే మూడు సార్లు బయటకు : గత 30 ఏళ్లలో ఈ నగలు కేవలం మూడు సార్లు మాత్రమే ప్రజల సందర్శనకు వచ్చాయి.
2001 & 2006: హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో ప్రదర్శించారు.
2019: ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో చివరిసారిగా ప్రదర్శనకు ఉంచారు.
రాష్ట్ర ప్రభుత్వం తగిన భవనం, నిరంతర భద్రత కల్పిస్తే వీటిని హైదరాబాద్‌కు తరలించే అంశాన్ని పరిశీలిస్తామని గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ, నేటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. సాలార్‌జంగ్ మ్యూజియంలో ఒక ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా పెండింగ్‌లోనే ఉంది.

