కామారెడ్డి(తెలుగు ప్రభ ): హైదరాబాద్లోని హెచ్ఎండీఏ మైదానంలో నిర్వహిస్తున్న సారస్ మేళా–2026లో కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయాలు చేపడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

సారస్ మేళాలో సంప్రదాయ వంటకాలు, పచ్చళ్లు, చిరుధాన్య ఉత్పత్తులు, గానుగ నూనెలను విక్రయిస్తూ విజయాలు సాధిస్తున్న దేవల సరోజ, కే. సుజాత, మోతే సుప్రియలను కలెక్టర్ అభినందించారు. మహిళలు తమ నైపుణ్యాలను వ్యాపార అవకాశాలుగా మలుచుకుని ఆదాయం పొందడంతో పాటు ఇతర మహిళలకు ఉపాధి కల్పించడం ప్రశంసనీయమన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా అందుతున్న పొదుపు, రుణ సదుపాయాలు, బ్యాంకుల సహకారం, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలు తయారు చేస్తున్న సంప్రదాయ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించి, మార్కెట్ అవకాశాలను పెంపొందించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
సారస్ మేళా వంటి ప్రదర్శనలు గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను విస్తృత స్థాయిలో వినియోగదారులకు పరిచయం చేసుకోవడానికి, వ్యాపారాలను విస్తరించుకోవడానికి చక్కని వేదికగా నిలుస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. మహిళల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం జరుగుతుందన్నారు. సారస్ మేళాలో కామారెడ్డి జిల్లా మహిళలకు అవసరమైన సహకారం అందిస్తూ వారి విజయాలకు తోడ్పడుతున్న సంబంధిత అధికారులు, సిబ్బందిని కూడా కలెక్టర్ అభినందించారు. మహిళా సంఘాల సభ్యులు ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి సాధించి, ఇతర మహిళలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. మహిళా సాధికారతకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.

