Homeతెలంగాణనిజామాబాద్‌Bchkunda: ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే తోట

Bchkunda: ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే తోట

  • పండుగ సాయన్న పోరాట స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి కృషి.. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

బిచ్కుంద (తెలుగు ప్రభ):.బిచ్కుంద మండలంలోని గుండె నేమ్లి గ్రామంలో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బుధవారం భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో ముదిరాజ్ సంఘం సభ్యుల సౌకర్యార్థం నిర్మించనున్న ఈ భవనం సామాజిక ఐక్యతకు, సంఘటిత అభివృద్ధికి వేదికగా నిలవనుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ముదిరాజ్ సమాజం ఐకమత్యంతో ముందుకు సాగుతూ విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సంఘ భవనాలు సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు, సమాజ సంక్షేమానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

- Advertisement -

అనంతరం జానపద వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ పోరాట స్ఫూర్తిని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. సమాజం కోసం ఆయన చేసిన పోరాటం, ధైర్యసాహసాలు నేటి యువతకు ఆదర్శమని అన్నారు. పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ముదిరాజ్ సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

లబ్ధిదారులకు సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ..

ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

దేవాడలో మహిళా శక్తి సంఘం భవనానికి భూమిపూజ..

అనంతరం దేవాడ గ్రామంలో మహిళా శక్తి సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వారి కార్యకలాపాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా బలోపేతం కావడానికి సంఘాలు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News