గోదాము వద్ద భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలి: కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, (తెలుగు ప్రభ ): ఈవీఎం గోదాము వద్ద భద్రతా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఈవీఎం గోదామును నెలవారీ తనిఖీలో భాగంగా పరిశీలించిన కలెక్టర్, అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
గోదాము వద్ద పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. గోదాము పరిసరాలపై 24 గంటల పాటు సీసీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగించాలని, భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు కొనసాగించాలని సూచించారు. భద్రతా వ్యవస్థలో ఏమైనా లోపాలు గుర్తిస్తే వెంటనే వాటిని సరిచేయాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఈవీఎంల భద్రత విషయంలో అన్ని స్థాయిల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. నెలవారీ తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, తహసీల్దార్ హిమబిందు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

