కామారెడ్డి,(తెలుగు ప్రభ ): బిక్కనూరు మండల కేంద్రంలో ఫ్యూజన్ పరిశ్రమ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. పరిశ్రమ విస్తరణ కోసం సంస్థ దరఖాస్తు చేసుకోవడంతో స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పరిశ్రమ విస్తరణ చేయబోమని గ్రామపంచాయతీకి రాతపూర్వకంగా హామీ ఇచ్చిన సంస్థ.. ఇప్పుడు అదే విస్తరణకు దరఖాస్తు చేయడం ఏంటనే ప్రశ్నలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
రాతపూర్వక హామీకి విలువ లేదా? : విస్తరణ చేపట్టబోమని పంచాయతీకి ఇచ్చిన రాతపూర్వక హామీ ఇప్పుడు ఏమైందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. హామీ ఇచ్చిన సమయంలో ఒక మాట.. ఇప్పుడు దరఖాస్తు సమయంలో మరో మాట అయితే, గ్రామపంచాయతీకి ఇచ్చిన హామీకి అసలు విలువ ఎంత? అన్న చర్చ మొదలైంది. రాతపూర్వకంగా ఇచ్చిన హామీ కేవలం కాగితాలకే పరిమితమైందా?అది కేవలం అప్పటి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇచ్చిన హామీయేనా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
నీటి వినియోగం పెంచేందుకేనా? : ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న విస్తరణలో భూగర్భ జలాల వినియోగాన్ని భారీగా పెంచడంతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచే అంశం ఉందన్న సమాచారం స్థానికుల్లో ఆందోళనకు కారణమవుతోంది.ఇప్పటికే పరిశ్రమల కారణంగా నీటి వనరులు, పర్యావరణంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో మరింత నీటిని వినియోగించే ప్రతిపాదన వస్తే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జనవరి ప్రజాభిప్రాయ సేకరణ ఏమైంది? : ఇదిలా ఉంటే జనవరిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణపై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. అప్పట్లో ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అభ్యంతరాలు, ఆందోళనలను అధికారులు ఏ మేరకు పరిగణనలోకి తీసుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కేవలం ప్రక్రియ పూర్తి చేయడానికేనా? ప్రజలు చెప్పిన మాటలకు విలువ లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పంచాయతీ స్పందన కోసం ఎదురుచూపులు : ఫ్యూజన్ పరిశ్రమ విస్తరణ దరఖాస్తుపై బిక్కనూరు గ్రామపంచాయతీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో సంస్థ ఇచ్చిన రాతపూర్వక హామీని పరిశీలిస్తుందా? భూగర్భ జలాల వినియోగంపై సమగ్ర వివరాలు కోరుతుందా? ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా? లేక దరఖాస్తుకు యథావిధిగా సహకరిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
ప్రజల భవిష్యత్తుతో చెలగాటమా?: పరిశ్రమల అభివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాకపోయినా, ప్రజల నీరు, పర్యావరణం, ఆరోగ్యం దెబ్బతినకుండా అభివృద్ధి జరగాలన్నదే స్థానికుల ప్రధాన డిమాండ్. గతంలో ఇచ్చిన హామీకి భిన్నంగా ఇప్పుడు విస్తరణ దరఖాస్తు రావడంతో అధికారులు మొత్తం వ్యవహారాన్ని పారదర్శకంగా ప్రజల ముందుంచాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల అనుమతులు, అభిప్రాయాలు కేవలం కాగితాలకే పరిమితమైతే.. రేపటి తరానికి మిగిలేది ఏమిటి? ఇప్పుడు బిక్కనూరు ప్రజల చూపంతా గ్రామపంచాయతీ నిర్ణయంపైనే. ఫ్యూజన్‌కు విస్తరణ దారి చూపుతుందా? లేక ప్రజల అభ్యంతరాలకు ప్రాధాన్యం ఇస్తుందా?తేలాల్సి ఉంది.

