అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు..
దేవునిపల్లి పోలీసుల చర్యలు
కామారెడ్డి,(తెలుగు ప్రభ ):కామారెడ్డి జిల్లాలోని లింగాయపల్లి గ్రామంలో అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ఘటనపై దేవునిపల్లి పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రామంలో డీజే ఏర్పాటు చేసి పెద్ద శబ్దంతో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నట్లు పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు.
డీజే నిర్వహిస్తున్న యజమానిపై కేసు నమోదు చేయడంతో పాటు డీజే పరికరాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు దేవునిపల్లి ఎస్సై రంజిత్ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం చట్టవిరుద్ధమని తెలిపారు.
గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా డీజేలు, అధిక శబ్ద పరికరాలు వినియోగిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అధిక శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సూచించారు. శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలు, డీజే నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
Also Read:Telangana: కొత్త పింఛన్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసిన టీజీ సర్కార్..

