కామారెడ్డి (తెలుగు ప్రభ): జుక్కల్ ఎక్స్ రోడ్ దాటి బిచ్కుంద సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్-1 డిపోకు చెందిన TS34Z0030 నంబర్ గల ఎక్స్‌ప్రెస్ బస్సు హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ అంజనేయులు బస్సు కింద చిక్కుకుని మృతి చెందారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పేర్కొంటూ, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాద ఘటనపై మంత్రి ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సులో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారని, వారంతా సురక్షితంగా బయటపడ్డప్పటికీ కొంతమందికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు మంత్రికి వివరించారు.

గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం, మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైన అన్ని వైద్య సహాయ చర్యలను తక్షణమే చేపట్టాలని సూచించారు.
ఆర్‌ఎం నేతృత్వంలో అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని, బాధితులకు అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలవాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలను తెలుసుకుని, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిలో ఒకరికి తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన క్షతగాత్రులకు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యాధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే
జుక్కల్ చౌరస్తాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తలకు తీవ్ర గాయమైన ఓ బాధితుడిని మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించినట్లు తెలిపారు. మిగిలిన వారికి బిచ్కుంద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని ఎమ్మెల్యే సూచించారు.

