Homeతెలంగాణనిజామాబాద్‌Kamareddy: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి.. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Kamareddy: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి.. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి(తెలుగు ప్రభ ): కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, కొబ్బరికాయ కొట్టి బతుకమ్మ ఆటలను ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆటల్లో పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపారు.

- Advertisement -

ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పండుగకు తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇటువంటి సాంస్కృతిక వేడుకలు మహిళల్లో ఐక్యతను, పరస్పర స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు మన సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వాటి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

బతుకమ్మ పోటీల విజేతలకు బహుమతులు

ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాలకు కలెక్టర్ జ్ఞాపికలను అందజేశారు. ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించిన బతుకమ్మల రూపకర్తలను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలతో పాల్గొని ఆటపాటలతో సందడి చేయడంతో కలెక్టరేట్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీఆర్‌డీఏ అధికారి దామోదర్ రెడ్డి, అదనపు డీఆర్‌డీఏ అధికారి విజయలక్ష్మి, వెంకటేష్, టీజీవో అధ్యక్షుడు దేవేందర్, కార్యదర్శి సాయిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News